బాబు గేమ్ స్టార్ట్ చేశారా...?

రాజకీయ దిగ్గజం గా అపార అనుభవజ్ఞుడిగా ఖ్యాతి గాంచిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని పోలవరం ప్రాజెక్ట్ అంశంలోకి తెలివిగా లాగారు. తనకు సుమారు రెండేళ్లనుంచి ప్రధాని అపాయింట్ మెంట్ సైతం ఇవ్వకపోవడంతో గుర్రుగా వున్న ఏపీ సీఎం ఇటీవల ఏ సమస్య వచ్చినా కేంద్రం మీద పెట్టి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసి వాచ్ చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశం అలాగే అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక కేంద్రానిదే బాధ్యత అని చేతులు దులుపుకున్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అంశంలో కేంద్రమంత్రి గడ్కరీ అంతా తానై వ్యవహరిస్తున్నా ప్రధాని అంతరాష్ట్ర సమస్యల పరిష్కారాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీం ఇచ్చిన సూచనలతో ...
సుప్రీం కోర్ట్ లో పోలవరం ప్రాజెక్ట్ పై వాజ్యం నడుస్తుండగా కేంద్రం ఎలా జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి నిర్మాణం చేస్తుందని ఒడిస్సా సర్వోన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. దీనిపై సుప్రీం పోలవరం ప్రాజెక్ట్ అంశంలో ఏపీ, ఒడిస్సా , చత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. అధికారుల స్థాయిలో సమస్యలు పరిష్కారం కావని చెప్పింది. ఇదే అంశంపై ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీ కి పోలవరం పై తమ రాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇంతకుముందే లేఖ రాశారు. తాజాగా కోర్టు సూచనతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలంటే ప్రధాని జ్యోక్యం చేసుకోవాలిసి ఉందని ఆయన సమావేశం పెట్టాలని సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై ఒడిసా , ఛత్తీస్ ఘడ్ సీఎం లతో మాట్లాడినట్లు వారు సానుకూలంగా స్పందించినట్లు ఏపీ సీఎం చెబుతున్నారు.
మరి సమస్య ఎక్కడ ..?
చంద్రబాబు , నవీన్ పట్నాయక్ లు గతం నుంచి మంచి స్నేహితులే. వారిద్దరూ చర్చించుకుంటే పోలవరం పై ఒడిస్సా అభ్యంతరాలు ఇట్టే తేలిపోతాయి. ఇక రమణ్ సింగ్ బిజెపి ముఖ్యమంత్రి కాబట్టి కేంద్ర స్థాయిలో ఆయనతో గడ్కరీ జ్యోక్యం చేసుకుంటే ఆ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ అంశంలో ప్రధాని జోక్యాన్ని ఏపీ సీఎం కోరడం ఇది జాతీయ ప్రాజెక్ట్ అంటూ నొక్కి చెప్పడం చర్చనీయాంశం.
- Tags
- చంద్రబాబు

