బాబు ఓవర్ కాన్ఫిడెన్స్ చూశారూ...!

వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుస్తాం... ఒకటి రెండు చోట్ల ఓటమి పాలయితే అక్కడి ప్రజలే బాధపడతారు.ఇదీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాట. ఏపీలోని 175 నియోజకవర్గాలను తామే గెలుచుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు దాదాపు ఎన్నికల శంఖారావాన్ని ఊదేశారు. ఈరోజు జన్మభూమి-మన ఊరుకార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే ఎన్నికలలో అన్ని సీట్లనూ గెలుస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
కూలీగా మారానని....
అయితే చంద్రబాబు చెబుతున్న లెక్కలను బట్టి రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని. అంతేకాదు 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని. అందుకోసమే తాను పడిన కష్టాన్ని చూడమంటున్నారు బాబు. నిద్రాహారాలు లేకుండా కూలీగా మారి నేను సేవ చేస్తుంటే తనకు ప్రతిఫలం ఇవ్వరా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని, ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలుపరుస్తున్నామన్నారు.
సమస్యలే లేవా?
అయితే ఇప్పటికీ ఏపీలో అనేక సమస్యలు కొలువుదీరి ఉన్నాయి. ప్రతిచోట సమస్యపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో రైతులు గిట్టుబాటు ధర లభించలేదని నిన్ననే ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో సమస్యలపై వినతి పత్రాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. నిరుద్యోగులు ఒకవైపు రోడ్డెక్కుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో అయితే ఏకంగా తమ పరిస్థితిని లేఖల ద్వారా మోడీకి వివరించారు. మరి 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉంటే ఇన్ని సమస్యలు వెలుగులోకి ఎలా వస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
మరి ఇతర నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారు?
ఇక అన్ని స్థానాల్లో గెలుపు ధీమా ఉన్నప్పుడు చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు. రాజకీయ పునరేకీకరణ జరగాలని ఎందుకు కోరుకుంటున్నారు. సర్పంచ్ ల నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకూ ఏ పార్టీ నుంచి వచ్చినా చేర్చుకోవాలని ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజంగానే ఆ నమ్మకం చంద్రబాబుకు ఉంటే మంచిదేనంటున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు ఏమీ మారలేదంటున్నారు. గతంలో తొమ్మిదేళ్లు పవర్ లో ఉన్నప్పటి మాదిరిగానే ఇప్పుడూ వ్యవహరిస్తున్నారంటున్నారు. కేవలం అధికారుల ఇచ్చే నివేదికలు, సర్వేలను చంద్రబాబు నమ్ముతున్నారని కొందరు టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తం మీద 175 నియోజకవర్గాలు గెలుస్తామని చంద్రబాబు చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్సేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
- Tags
- చంద్రబాబు

