బాబు ఇకపై ఇక్కడ కూడా....?

రేవంత్ దెబ్బకు చంద్రబాబు తెలంగాణలో పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టనున్నారు. రేవంత్ వెంట దాదాపు 40 మంది వరకూ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆయన ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నేతలకు పార్టీ పై దిశానిర్దేశనం చేయనున్నారు. రేవంత్ వెళ్లిపోవడం చంద్రబాబుకు ఊహించని దెబ్బే. రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన అనంతరం చంద్రబాబు తెలంగాణ పార్టీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పెద్దగా కాదు..అస్సలు ఇటు వైపు చూడలేదనడం కరెక్టేమో. రేవంత్ నడిపిస్తాడులే అన్న ధీమాలో చంద్రబాబు ఉన్నారు. అందుకే వారంతంలో హైదరాబాద్ వచ్చినా ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడిపే చంద్రబాబు పార్టీ నేతలను కూడా పెద్దగా కలిసేవారు కాదు. ఫోన్లోనే రేవంత్ తన కార్యాచరణను చెప్పడం ఆయన ఓకే అనడంతో సరిపోయేది. అయితే రేవంత్ వెళ్లిన తర్వాత పార్టీ పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది.
రేవంత్ అంశంపైన కూడా....
రేవంత్ వెంట ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క వెళతారని చంద్రబాబు ఊహించనేలేదు. ఇప్పటికే కొందరు నేతలు వెళ్లిపోగా మరికొందరు రెడీ ఉన్నట్లు కూడా చంద్రబాబుకు సమాచారం ఉంది. దీంతో ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీకి ఇకపై సమయం కేటాయిస్తాననిచెప్పనున్నారు. నెలకు ఒకరోజు ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చి పార్టీ నేతలను కలిసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. అంతేకాకుండా ఇకపై ఎవరూ రేవంత్ వెంట వెళ్లకుండా ఉండేందుకు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయనున్నారు. ఇక రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ చంద్రబాబు వద్దే ఉంది. పార్టీకి ఇచ్చిన రాజీనామాతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు రాసిన పత్రాన్ని చంద్రబాబుకే బెజవాడలో రేవంత్ ఇచ్చి వచ్చారు. దీనిపై కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపే అవకాశముంది. ఈ సమావేశానికి అందరూ హాజరుకావాలని ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. కొడంగల్ ఉప ఎన్నికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఇకపై ఏపీలోనే కాకుండా తెలంగాణలో పార్టీపై కూడా దృష్టి పెడతారని, నేతలకు కార్యాచరణను నిర్దేశిస్తారని టీటీడీపీ నేతలు చెబుతున్నారు. చూద్దాం... చంద్రబాబు సమావేశం ఏ రకమైన ఫలితాలనిస్తుందో....!
- Tags
- చంద్రబాబు

