బాబును ఏకిపారేసిన జగన్

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. శ్రీకాళహస్తిలో ఆయన బాబును తూర్పారబట్టారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలనున సిగ్గులేకుండా తమ పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోట్ల రూపాయలు కట్టబెట్టి మరీ పార్టీ కండువా కప్పేశారన్నారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులను కూడా కట్టబెట్టిన చంద్రబాబు రాజ్యాంగాన్ని అవహేళన చేశారన్నారు. దేశంలో ఇటువంటి నీచ రాజకీయాలు మరెక్కడా చూడలేదని జగన్ అన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
హెరిటేజ్ కోసమే....
చంద్రబాబు సీఎం అయిన వెంటనే చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ కర్మాగారాలన్నీ మూతబడతాయన్నారు. తన సొంత హెరిటేజ్ కంపెనీ కోసం చిత్తూరు డెయిరీని మూయించి వేశారన్నారు. హెరిటేజ్ లాభాల్లో ఉండాలనే చంద్రబాబు లాభాల బాటలో నడుస్తున్న డెయిరీని మూత వేయించారని ఆరోపించారు. జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటానికి కూడా చంద్రబాబు కారణమని ఆరోపించారు. దీంతో చెరుకు రైతులతో పాటు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.
మేనేజ్ చేయడంలో నిపుణుడే....
జగన్ 900 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్లకు పాదయాత్ర చేరుకుంది. చెర్లోపల్లి గ్రామంలో ఈ సందర్భంగా జగన్ రావి మొక్కను నాటారు. చంద్రబాబు నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేయడంలో మంచి నిపుణుడని కొనియాడారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ సంకల్ప యాత్రకు మంచి స్పందన లభించింది.
- Tags
- జగన్

