బాబుకు మీడియా కవరేజీ ఎందుకు తగ్గిందంటే...?

చంద్రబాబు పేరు వింటే చాలు మీడియా లో ఆయనకు వచ్చే కవరేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకు అన్నది అందరికి తెలిసిందే. అధికారంలో వున్నా , విపక్షంలో వున్నా మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన వారు దేశంలోనే లేరన్నది పబ్లిక్ టాక్. కానీ ఆయనకు రాష్ట్ర విభజన తరువాత ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పోటీ పడలేకపోతున్నారు. కారణం 99 శాతం మీడియా హైదరాబాద్ కేంద్రంగా పనిచేయడమే. దాంతో తెలుగు మీడియా తొలి ప్రాధాన్యత కేసీఆర్, ఆ తరువాతే చంద్రబాబు గా మారిపోయింది.
కేసీఆర్ గుప్పిట్లో...?
హైదరాబాద్ లో వున్న ఎలక్ట్రానిక్ మీడియా 2014 ఎన్నికల తరువాత కేసీఆర్ ఇచ్చిన జర్క్ తో ఒక్కసారిగా అధికారపార్టీ కి చేతులు కట్టేయాలిసిన పరిస్థితి ఏర్పడింది. టివి 9, ఏబీఎన్ ఛానెల్స్ ప్రసారాలు బంద్ చేసి, అన్ని ఛానెల్స్ కి పరోక్షంగా కేసీఆర్ ఒక హెచ్చరిక పంపడం దేశవ్యాప్తంగా సంచలనమే అయ్యింది. ఆ తరువాత ఆ ఛానెల్స్ రాజీ పడటం వారి పై బ్యాన్ ఎత్తివేయడం తెలిసిందే. నాటి పరిణామాల నేపధ్యం తరువాత ఏ ఛానెల్ టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించిన పాపానికి పోలేదు. ఇక ప్రైమ్ టైం కానీ ఇతర ఏ సందర్భంలోను బులిటెన్స్ అన్ని గులాబీ దళం తోనే కలిసి సాగుతూ ఉంటాయి. ముందు తెలంగాణ ఆ తరువాతే ఆంధ్ర సీఎం వార్తలు నడుస్తుండటం 30 నిమిషాల బులెటిన్ లో 20 నిమిషాలకు పైబడి టి భజనతో సరిపెట్టేస్తున్నారు.
అసెంబ్లీ జరుగుతున్నా అంతే ...
కీలకమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కూడా వివక్ష కొనసాగుతుంది. ఏపీకి రెండో ప్రాధాన్యతే హైదరాబాద్ మీడియా ఇస్తుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీని విపక్షం బహిష్కరించింది. అనేక ప్రజా సమస్యలపై అధికారపార్టీ తానే విపక్షంగా వుంటూ ప్రస్తావిస్తూ ప్రజోపయోగ చర్చలు సమాధానాలు ఇస్తుంది. అయినా కానీ ఆస్థాన మీడియా ఏబీఎన్ తప్ప మిగిలిన మీడియా లో ఆ చర్చలకు ప్రాధాన్యతే లేకుండా పోయింది. తెలంగాణ అసెంబ్లీ పైనే అందరి ఫోకస్ నడుస్తుండటం విశేషం. ఇదే ధోరణి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే ఏపీలో అధికారపార్టీకి మైనస్ గానే చెబుతున్నారు విశ్లేషకులు. తెలంగాణ ప్రభుత్వ తరహాలోనే ఏపీలో కూడా ఎన్టీవీ పై కొంత కాలం ఆంక్షలు పెట్టినా ఏపీ సీఎం ను ప్రభుత్వాన్ని తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.

