బాపట్ల ఎమ్మెల్యే కోన వెంకట్ !!

అదేమిటి ... బాపట్ల ఎమ్మెల్యే వైకాపా నాయకుడు కోన రఘుపతి కదా, వీళ్లు కోన వెంకట్ అంటున్నారేమిటి? అని ఆశ్చర్యం కలుగుతోందా? ఇది భవిష్యత్ వాణి! మరో రకంగా చెప్పాలంటే భవిష్యత్ స్వప్నవాణి!! అవును మరి.. సినీ రచయిత కోన వెంకట్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చాలా బలంగా అనుకుంటున్నారట. బాపట్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలనేది ఆయన కోరికట. అయితే ఇంకేముంది ఏదో ఒక రోజు ఆయన ఎమ్మెల్యేగా బరిలో మనకు కనిపించడం గ్యారంటీ.
ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మర్మం చెప్పారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది తన అంతిమలక్ష్యం అని ఆయన సెలవిచ్చరు. ఆయనకు తన స్వస్థలం అయిన బాపట్ల పరిధిలో యూత్ లోగానీ, వివిధ సంఘాల్లోగానీ మంచి పట్టు కూడా ఉన్నదిట. అంటే ఎప్పుడో తాను ప్లాన్ చేసుకుంటున్న ఎన్నికల ఎంట్రీ రంగం సిద్ధం చేసుకుంటున్నారన్నమాట. ‘ఎమ్మెల్యే అవుతానో, ఎంపీ అవుతానో తెలియదు.. కానీ ఏదో ఒకటి తప్పకుండా అవుతాను’ అని కోన వెంకట్ అంటున్నారు.
బహుశా ఆయనకు తెలియకపోవచ్చు గానీ.. బాపట్ల ఎంపీ రిజర్వుడు నియోజకవర్గం. ఆయనకు బాపట్లలో తప్ప మరెక్కడా బలం, ఆసక్తి ఉన్నట్లుగా చెప్పుకోలేదు గనుక.. బహుశా ఆయన బాపట్ల ఎమ్మెల్యే సీటు మీదనే కన్నేయవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతిని వైకాపా 2019లో సిటింగ్ కోటాలో మళ్లీ మోహరిస్తుంది గనుక.. కోన వెంకట్ బహుశా తన ఎంట్రీ కోసం తెలుగుదేశాన్ని ఆశ్రయిస్తాడేమో అని కూడా పలువురు ఊహాగానాలు చేస్తున్నారు.

