బతుకమ్మ చీరలను రిజెక్ట్ చేసిన వారెందరో తెలుసా?

బతుకమ్మ చీరలు మిగిలిపోయాయి. దాదాపు తొమ్మిది లక్షలు చీరలు మిగిలిపోయాయి. ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది లక్షల మంది పేద మహిళలు చీరలను తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇవి గణాంకాలే. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కోటి నాలుగు లక్షల మంది నిరుపేద మహిళలున్నారని ప్రభుత్వం గుర్తించింది. తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేసింది. ప్రతి మండల కేంద్రంలోనూ వీటిని పంపిణీ చేసింది. రాష్ట్రంలో చీరల కొరత ఉండటంతో సూరత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించింది. అయితే చీరల పంపిణీలో కొన్ని అపశృతులు చోటుచేసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ సజావుగానే జరిగింది. కాని తొమ్మిది లక్షల చీరలు జిల్లా కేంద్రాల్లో మూలుగుతున్నాయి.
ఎంపిక వల్లనేనా? నాసిరకమనా?
అయితే అధికారులు లబ్దిదారులను గుర్తించడంలో లోపం జరిగిందన్నది ప్రభుత్వ వాదనగా విన్పిస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకే ఈ అవకాశం ఉండటం, ఆధార్ కార్డు నిబంధనను తప్పనిసరిగా అమలు చేయడం వల్ల కూడా కొందరు మహిళలు తీసుకోలేక పోయారు. మరోవైపు కొందరు నాసిరకం చీరంలూ తీసుకునేందుకు ముందుకు రాలేదు. రేషన్ కార్డులో తప్పనిసరిగా పేరు ఉండాలన్న నిబంధన కూడా కొందరికి చీరలు తీసుకోవడానికి వీల్లేకుండా పోయింది. పక్కా నిబంధనలు, నాసిరకం చీరలు కావడంతో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 3,05,312 చీరలు మిగిలిపోయాయి.రంగారెడ్డి జిల్లాలో 1,17,000 చీరలు మిగిలిపోయాయి. హైదరాబాద్ లో నిబంధనలను అధికారులు పక్కాగా అమలుచేయడం వల్లనే ఇన్ని చీరలు మిగిలి పోయాయంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేటలో 1400 చీరలు మిగలగా, నాసిరకం చీరలంటూ ఘర్షణలు జరిగిన జగిత్యాల జిల్లాలో వంద శాతం చీరల పంపిణీ జరగడం విశేషం.
- Tags
- బతుకమ్మ చీరలు

