ఫిరాయించిన ఏపీ ఎమ్మెల్యేల్లో గుండెదడ!

అధికార పార్టీ చెప్పుకుంటున్నట్లుగా తెలుగుదేశం పరిపాలనను చూసి ముచ్చట పడి, ఎగబడి ఆ పార్టీలోకి వెళ్లి చేరారో.. లేదా.. ఏదైనా ప్రలోభాలకు లొంగి వెళ్లి చేరారో వేరే సంగతి మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి , ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు 20 మంది సైకిలు పార్టీలోకి ఫిరాయించారు. ఇప్పుడు తాజాగా హైకోర్టులో నోటీసుల నేపథ్యంలో వారందరిలోనూ గుండెదడ పెరిగినట్లుగా తెలుస్తోంది. తమ ఫిరాయింపులకు సంబంధించి ఎందుకు చర్య తీసుకోలేదో.. స్పీకరుకు నోటీసులు ఇస్తే.. తమకు ఇబ్బంది ఉండేది కాదని అనుకుంటున్న ఎమ్మెల్యేలు.. నేరుగా తమకే నోటీసులు వచ్చేసరికి ఆందోళన చెందుతున్నారు. న్యాయవాదులను సంప్రదించి ఈ గండం నుంచి క్షేమంగా బయటపడడం ఎలాగో ఆరాలు తీస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఫిరాయించి తెరాసలో చేరిన వైనం, వారిపై అనర్హత వేటు గురించి స్పీకరు పట్టించుకోకపోవడం అనేది ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్లి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది చాలా తీవ్రమైన రాజకీయ చర్చనీయాంశంగా ఉంది. అలాంటి నేపథ్యంలో ఏపీలో వైకాపా ఎమ్మెల్యేలు చేసిన ఫిరాయింపు వ్యవహారం కూడా హైకోర్టులో విచారణకు వచ్చింది.
అయితే తెలంగాణ వ్యవహారంలో కోర్టు కేసుకు, ఏపీ వ్యవహారంలో కోర్టు కేసుకు చిన్న తేడా ఉంది. తెలంగాణలో ఫిరాయింపుల విషయంలో స్పీకరు నిర్ణయం తీసుకోలేదంటూ.. ఆయనను ప్రతివాదిగా పేర్కొంటూ పిటిషన్ వేశారు. స్పీకరును ప్రశ్నించే అధికారం కోర్టుకు ఉన్నదా లేదా అనే మీమాంస వద్దనే కేసు సాగుతూ ఉంది. అయితే ఏపీలో పిటిషన్ వేసిన వైకాపా ఉరవకొండ ఎమ్మెల్యే చిన్న ట్విస్టు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరినీ ప్రతివాదులుగా చేర్చారు. అలాగే చేర్చుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును, తెలుగుదేశం పార్టీని, ఎన్నికల సంఘాన్ని కూడా ప్రతివాదులు కింద చేర్చారు. దీంతో హైకోర్టు ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది.
హైకోర్టు నోటీసులకు ఎలా స్పందించాలనే విషయంలో వైకాపా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తోంది. తాము పార్టీ మారలేదని చెప్పడానికి అవకాశం లేదు. అలాంటి కౌంటర్ వేయలేరు. పార్టీ మారాము అని న్యాయ స్థానంలో ఆన్ రికార్డ్ చెబితే తమ గోతిని తామే తవ్వుకున్నట్లు అవుతుందేమో అని భయం. అలాంటి సందేహాలతో న్యాయనిపుణులను సంప్రదించి.. గండంనుంచి బయటపడే మార్గాలు వెతుక్కుంటున్నారట.

