ఫస్ట్ఇన్నింగ్స్లో చుక్కలు చూపించిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో భాగంగా.. రాజ్ కోట్ లో బుధవారం ప్రారంభం అయిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ బౌలర్లకు మొదటి ఇన్నింగ్స్ లో చుక్కలు కనిపించాయనే చెప్పాలి. రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుందని చెప్పుకోవడం తప్ప ఏ రకంగానూ తప్పించుకోలేని రీతిలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ చాలా నిలకడగా ఆడుతూ భారీ స్కోరును నమోదు చేశారు. రెండో రోజు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యే లోగా 537 పరుగులు చేసిందంటే బ్యాట్స్ మెన్ ఎలా ఆడుకున్నారో అర్థమవుతుంది.
రూట్, ఎం.ఎం. ఆలీ, బీఏ స్టోక్స్ ముగ్గురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేశారంటే ... వారి మీద మన బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారనే సంగతి స్పష్టమవుతుంది. భారత బౌలర్ల వికెట్ల వేట అతి కష్టమ్మీద సాగింది. కెరీర్ లో మొదటిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 19 ఏళ్ల కుర్రాడ్ హమీద్ దగ్గరినుంచి ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కూడా మన బౌలర్ల ధాటికి బెదిరిపోలేదంటే అతిశయోక్తి కాదు.
రెండో రోజు 537 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రస్థానం ముగిసింది. భారత్ ఓపెనర్లు గౌతం గంభీర్ , మురళీ విజయ్ లు కలిసి 23 ఓవర్ల పాటూ వికెట్ నష్టపోకుండా బ్యాటింగ్ సాగించి.. 63 పరుగులు చేయగలిగారు.
అయితే మ్యాచ్ మాత్రం డ్రా దిశగానే సాగే అవకాశం కనిపిస్తోంది. మూడోరోజు ఆటలో భారత బ్యాట్స్ మెన్ విపరీతంగా చెలరేగిపోయి.. సాయంత్రంలోగా 537 పరుగుల టార్గెట్ ను కూడా అందుకుని నాలుగోరోజు ఆట మొదలయ్యేలోగా ఇంగ్లాండ్ ను రెండో ఇన్నింగ్స్ కు బ్యాటింగ్ కు దింపితే తప్ప.. ఈ తొలి టెస్ట్ లో ఫలితం తేలే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి తొలి టెస్ట్ డ్రా దిశగానే నడుస్తున్నట్లు అనుకోవాలి.

