ఫడ్నవిస్ ఓటమిని ముందే ఒప్పేసుకున్నారా?

శివసేన కలసి రాకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదా? మిత్రపక్షం దూరమైతే అధికారానికీ దూరమవుతారా? అవును ఇప్పుడు మహారాష్ట్ర బీజేపీలో అదే చర్చ జరుగుతోంది. శివసేన, బీజేపీ కలసి పోటీ చేస్తేనే విజయం. అలా కాకుండా వేర్వేరుగా పోటీ చేస్తే అధికారానికి దూరమవుతామేమోనన్న బెంగ బీజేపీ నేతలకు పట్టుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని అర్బన్ ప్రాంతాల్లో శివసేనకు గట్టి పట్టుంది. దాదాపు ఇరవై ఏళ్లుగా శివసేన, బీజేపీలు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో శివసేన 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది.
ఒంటరిగా పోటీ చేస్తే....
అయితే శివసేన ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి అధికారానికి దూరమవుతామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా అంగీకరించారు. శివసేన తమను బెదిరిస్తుందని, కాని వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తే...నష్టపోయేది శివసేన మాత్రమేనని ఫడ్నవిస్ చెప్పారు. అంతేకాదు తమ పార్టీ ఓడిపోతే ఓడిపోవచ్చు...కాని ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం శివసేన ఘోరంగా...చిత్తుగా ఓడిపోతుందని ఫడ్నవిస్ జోస్యం చెప్పారు. అంటే విడిగా పోటీ చేస్తే ఇద్దరికీ ఓటమి తప్పదని ఆయన హెచ్చరించారు.
శివసేనకు ముందస్తు హెచ్చరిక....
అంటే శివసేనకు ఒకరకంగా ఫడ్నవిస్ ముందస్తు హెచ్చరిక జారీ చేశారన్నమాట. ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయదని తాను ఇప్పటికీ భావిస్తున్నానని ఫడ్నవిస్ తెలిపారు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సింది శివసేన మాత్రమేనని, శివసేన ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని భావిస్తున్నానని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద శివసేన తమ నుంచి దూరం కాకుండా చూడటానికి కొంత ప్రయత్నాలను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రారంభించినట్లే తెలుస్తోంది. ముఖ్యంగా శివసేన అధినేత ఉధ్దవ్ ఠాక్రే ప్రజాసమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని, కేవలం ప్రచారానికే పరిమితమవుతుందని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో శివసేనను దువ్వే పనిలో ఫడ్నవిస్ ఉన్నారా? లేక ఓటమికి సిద్ధం కావాలని సంకేతాలు పంపారా? అన్నది మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

