ప్రభుత్వ పరువు తీసిన దుర్గ గుడి పాలకమండలి ... ?

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరువు నిండా తీసింది. అసలు పూజలు జరగలేదని ఈవో సూర్యకుమారి, దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావు టిడిపి నేతలు చెప్పుకొచ్చారు. కానీ పూజలు జరిగాయని ఈవో కోసమే ఈ పూజలు ఆమె జరిపించుకున్నట్లు పాలకమండలి ఆరోపించింది. అసలే ఈ వ్యవహారంలో విమర్శలపాలైన సర్కార్ కి పాలకమండలి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పాలకమండలి, ఈవో నడుమ సమన్వయం లేదన్నది ఇద్దరికీ పొసగడం లేదన్న అంశం మరోసారి తేటతెల్లం అయింది.
రంగంలోకి ముఖ్యమంత్రి ...
చిలికి చిలికి గాలివానగా మారిన తాంత్రిక పూజల వివాదానికి స్వస్తి పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. పాలకమండలి ప్రభుత్వ వాదనకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలపై బాబు యమా సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై విచారణ కమిటీ ని నియమిస్తే, వారి విచారణ పూర్తి కాకుండా పాలకమండలి పూజల వ్యవహారాన్ని నిర్ధారించేయడం ఏమిటని బాబు తన సమీక్షలో కడిగేశారంటున్నారు. తక్షణం ఈ వ్యవహారంలో మౌనంగా ఉండని పక్షంలో పాలకమండలి కి ఉద్వాసన పలికేందుకైనా వెనుకాడనని చంద్రబాబు హెచ్చరించడం వివాద తీవ్రత చెప్పక చెబుతుంది. తదుపరి ఎలా నడుచుకోవాలో పాలకమండలి కి సూచించేందుకు బుద్ధా వెంకన్న కు ఈ బాధ్యతలను చంద్రబాబు అప్పగించడం ఆయన యాక్షన్ లోకి దిగి అందరి నోటికి తాళం వేయించే పనిలో పడటంతో తాంత్రిక పూజల వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.
- Tags
- దుర్గగుడి

