ప్రభుత్వం బలహీనపడిందన్న ఉద్యమనేత

ఆరో విడత అమరుల స్ఫూర్తి యాత్రకు పోలీసు అనుమతి కోరామని, మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, యాత్ర మొదలైన తర్వాత అనుమతి తీసుకొచ్చేందుకు వెళ్లాల్సిన వ్యక్తిని గృహనిర్భంధం చేశారని టీజేఏసీ నేత కోదండరామ్ తెలంగాణ సర్కార్ పై ఫైరయ్యారు. యాత్రపై ఆఖరు నిమిషంలో పోలీసులు మనసు మార్చుకున్నారన్నారు.
కులం పేరు అడుగుతున్నారు....
అర్ధరాత్రి నుంచే ఐకాస నేతల అరెస్టులు ప్రారంభించారని, వరంగల్ 300, హైదరాబాద్ లో 110 మందిని, మొత్తం 400 మందిని అరెస్టు చేశారని, అరెస్టు చేసిన తర్వాత పోలీసు స్చేషన్ లో పుట్టుమచ్చలతోపాటు కులం పేరు అడిగారని, కులం అడిగే సంప్రదాయం అనాగరికమైనదని, ఇది మారాలని కోదండరామ్ అన్నారు.కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు తమను గుర్తుపట్టడానికి అనుకూలమైన రీతిలో యూనిఫాం ధరించాలని, కానీ ఆ నిబంధనలు పాటించకుండా... సివిల్ దుస్తుల్లో వచ్చారని ఇది సరికాదన్నారు. సెక్షన్ 151 కింద అరెస్టు చేయడం అన్యాయమని, మానభంగాలు, దొమ్మీల వంటి కాగ్నిజబుల్ నేరం జరిగే అవకాశం ఉందనుకున్నప్పుడే, ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే సెక్షన్ 151 వర్తిస్తుందన్నారు. కానీ తమ కార్యక్రమం గురించి ప్రభుత్వానికి , పోలీసులకు ముందే వెల్లడించామని, ఈ ప్రభుత్వం బలహీనపడుతోందని, తమని చూసి భయపడుతోందని చెప్పారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే మమ్మల్ని అరెస్టు చేశారని, నిన్నటి సంఘటనలతో మా సంకల్పం మరింత బలపడిందన్నారు. అన్ని పార్టీలకు నిన్నటి పరిణామాలు వివరిస్తామని, గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.కోర్టుకు కూడా వెళ్తామన్నారు.. ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు.
7వ విడత యాత్ర నల్లగొండ నుంచి.....
నల్గొండలో 21, 22 లో 7వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తామని, ఇప్పటికే ధరఖాస్తు కూడా పెట్టుకున్నామన్నారు. అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నామని, నిరుద్యోగులందరికీ ఏ ప్రబుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 2లక్షలు ఖాళీలున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉద్యోగాలు రావడంలేదని ఇప్పటికే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారని, సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగమైనా ఇవ్వాలని, లేదంటే నిరుద్యోగ భృతి అయినా ప్రకటించాలన్నారు. మేం లేవనెత్తిన 6 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, సమాజంలో రాజకీయాలు అనివార్యమని, అవి బాగాలేనప్పుడు సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. తమకు వెనక్కిమళ్లే దారిలేదన్నారు. ఆరునూరైనా మా ప్రయాణం ముందుకే సాగుతుందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడామని, ఈ ప్రభుత్వంతమదని, ప్రజల హక్కులకోసం కొట్లాడే హక్కు మాకు ఉందని కోదండరామ్ తెలిపారు.
- Tags
- కోదండరామ్

