పోలవరాన్ని కేంద్రం లాగేసుకున్నట్లేనా...!

టెండర్ల గోల్ మాల్ తో ప్రతిష్టంభన ఏర్పడ్డ పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రం దాదాపు హైజాక్ చేసినట్లే. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించబడిన పోలవరాన్ని కేంద్రమే కట్టి ఇవ్వాలి. పనులు నత్తనడకన జరుగుతాయన్న ఆందోళనతో రాష్ట్రప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా కేంద్రాన్ని బతిమాలుకొని పర్యవేక్షణ బాధ్యత చేపట్టింది. ప్రాజెక్ట్ కి నిధులు కేంద్రం ఇస్తున్నా ప్రచారంలో ఏపీ సర్కార్ మాత్రమే ఇదంతా పూర్తి చేస్తున్నట్లుగా హంగామా నడవడం కేంద్రానికి తొలుత ఆగ్రహం కలిగించినా టిడిపి ఎన్డీయే లో భాగస్వామి కావడంతో తప్పులు జరిగే వరకు ఆచితూచి వేచి చూసింది. రాష్ట్రం పాత కాంట్రాక్టర్ ను కాదని కొత్తగా టెండర్లు పిలవడం అవికూడా పూర్తి అవకతవకలతో ఉండటంతో కేంద్రం ఆ ప్రక్రియకు బ్రేక్ వేసింది. దాంతో గతుక్కుమన్న ఏపీ సర్కార్ ఇలా అయితే లాభం లేదు మీరే కట్టుకోండి అనే పరిస్థితికి దిగిపోతూ ఇంతవరకు ఖర్చు చేసిన సొమ్ములు ఇవ్వాలనే డిమాండ్ తో లాబీయింగ్ మొదలు పెట్టింది.
పెరిగిన ఖర్చు కేంద్రం భరించదు ... పునరావాసం సంబంధం లేదు ...
ఇక పోలవరం ప్రాజెక్ట్ భవితవ్యంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కెవిపి రామచంద్ర రావు, మాజీ కేంద్రమంత్రులు పల్లంరాజు నేతృత్వంలో కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ ని కలిసి ప్రశ్నలు వేశారు. దీనిపై గడ్కరీ సుదీర్ఘ వివరణ వారికి ఇచ్చారు. తాము 2018 కల్లా నిర్మిస్తామని తీసుకోవడం వల్లే ఏపీ సర్కార్ కి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పెరిగిన ఖర్చు కేంద్రానికి సంబంధం లేదని పాత కాంట్రాక్టర్ పూర్తి చేసి అప్పగిస్తారని చెప్పారు. పునరావాసానికి అయ్యే వ్యయం రాష్ట్రమే భరించాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో మేం పూర్తి చేసి తీరతామన్న గడ్కరీ ...
కాంగ్రెస్ బృందంతో భేటీ అనంతరం పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారులు ఏపీ జల మంత్రి దేవినేని ఉమ బృందంతో గడ్కరీ సుదీర్ఘ చర్చలు జరిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరతామని లక్ష్యానికి అనుగుణంగా పనుల్లో వేగం పెంచుతామని చెప్పారు గడ్కరీ. ఈ సమయంలోనే దక్షిణ కొరియా లో వున్న చంద్రబాబు గడ్కరీ తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బు అయినా ఇవ్వాలని బాబు కేంద్రమంత్రి కి విజ్ఞప్తి చేశారు. మీరు వచ్చాక డిటైల్ గా చర్చించి అప్పుడు చూద్దామని గడ్కరీ చెప్పడంతో 2800 కోట్ల రూపాయల రావలిసిన బాకీ పెండింగ్ లోనే వుంది. ఈనెల 22 న తాను పోలవరం సందర్శిస్తానని అప్పుడు పూర్తి స్థాయిలో నిర్ణయాలు సంయుక్తంగా ప్రకటిద్దామని ఏపీ సీఎం కి గడ్కరీ చెప్పారు. రెండు నెలల పాటు టెండర్లు వాయిదా వేయాలని ఆదేశించారు.
టెండర్లు అటకెక్కినట్లేనా ....?
తప్పుల తడకగా వున్న టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని కేంద్రమంత్రి ఆదేశించిన నేపథ్యంలో గడ్కరీ పోలవరం పర్యటన పూర్తి అయ్యే వరకు ప్రతిష్టంభన కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ములు తిరిగి చెల్లించే వ్యవహారం పెండింగ్ లోనే వుంది. అయితే పనులు జరిగిన తీరును బట్టి కేంద్రం మరో మూడు వందల కోట్ల రూపాయలను ప్రాజెక్ట్ కి మంజూరు చేసింది. గడ్కరీ ఆ ఫైల్ పై సంతకం చేయడంతో ప్రాజెక్ట్ పై తమకు చిత్తశుద్ధి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. మేమె పూర్తి చేస్తామంటూ ఆయన చెప్పడాన్ని బట్టి కేంద్రం ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ను స్వాధీనం చేసుకుంటుందనే వాదనలు బిజెపి శ్రేణులనుంచి వినవస్తుంది
- Tags
- పోలవరం

