పోలవరం పై మళ్లీ మెలిక ...!

తమ రాష్ట్ర అభ్యంతరాలను కాదని జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తూ ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. తక్షణం ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేయాలని ఆయన లేఖలో అభ్యర్ధించారు. ఒడిస్సా అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం సరికాదన్నారు లేఖలో పట్నాయక్. పోలవరం ప్రాజెక్టు పై సుప్రీం కోర్టు లో కేసు నడుస్తుందని అది పూర్తి కాకుండా ఎలా అనుమతులు ఇస్తూ నిర్మిస్తారని నిలదీశారు ఆయన. అంతరాష్ట్ర సమస్యలు పరిష్కరించకుండా ఇలా ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగించడాన్ని తప్పు పట్టారు నవీన్.
అసలు ఒడిషా అభ్యంతరాలు ఏంటి ?
పోలవరం డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే ఒడిషా లోని గిరిజన గ్రామాలు అనేకం నీట మునిగే పరిస్థితి వుంది. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావంతో ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేలోపు ఎగువ ప్రాంతంలో కరకట్ట నిర్మాణం చేపట్టాల్సి వుంది. దాంతో పాటు నిర్వాశితులకు నష్టపరిహారం చెల్లించడం ఒడిషా తో అంతరాష్ట్ర జల ఒప్పందాలు అవసరం. గతంలో ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో నాటి సీఎం వైఎస్ ఒడిషాతో అనేక సార్లు సంప్రదింపులు జరిపి వారి డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని భావించిన యుపిఎ ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై వివాదాల పంచాయితీ లేకుండా పోయింది. దాంతో గత కొంత కాలంగా పోలవరం నిలుపుదలకు ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ సుప్రీం కోర్టు నుంచి కేంద్రంతో కొట్లాట వరకు చేయని ప్రయత్నం లేదు. తాజాగా మరోసారి ఒడిషా సీఎం పట్నాయక్ ప్రధాని మోడీ కి రాసిన లేఖ ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- పోలవరం

