పోలవరం క్లియర్ అవుతుందా?

పోలవరం నిర్మాణంపై కొంత ముందడుగు పడింది. కేంద్రం కొంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు దిగివచ్చింది. పోలవరం నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తిచేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నెరవేరేటట్లు కన్పించలేదు. కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి కొర్రీలు వేసింది. నిధుల విడుదలలో కూడా జాప్యం చేస్తోంది. కాంట్రాక్టర్ ను మారిస్తే మళ్లీ అంచనా వ్యయం పెరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. దీనిపై కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించి నివేదిక అందించిన తర్వాతనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పదే పదే స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఘాటుగా లేఖ కూడా రాశారు.
వారంలో కీలక సమావేశం.....
ఈ నేపథ్యంలో నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్రమంత్రి సుజనాచౌదరి కలిశారు. ప్రాజెక్టుకున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులన్నింటినీ ఆయన వివరించారు. దీంతో కాంట్రాక్టర్ మార్పు, పెండింగ్ నిధులు, పునరావాస నిధులు, పోలవరం అంచనాల పెంపు వంటి విషయాలపై ఆయన క్షుణ్ణంగా నితిన్ గడ్కరీకి వివరించారు. దీంతో గడ్కరీ వారం రోజుల్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొననున్నారు. పోలవరం అథారిటీ సీఈవో స్థాయిని సెక్రటరీ హోదాకు మార్చేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత అన్ని విషయాలపై నిర్ణయం తీసుకుంటామని నితిన్ గడ్కరీ చెప్పినట్లు సుజనా చౌదరి తెలిపారు.మొత్తం మీద ఒక వారంలో పోలవరానికున్న అడ్డంకులుతొలగిపోనున్నాయి.
- Tags
- పోలవరం

