పులివెందులలో జగన్కు ఓటమి తప్పదా?

కింద పడ్డా సరే నాదే పైచేయి అనే నైజం ప్రదర్శించడంలో రాజకీయ నాయకులు అందరికంటె ముందు వరసలో ఉంటారు. అలాంటిది పైచేయి వారిదిగానే ఉన్నప్పుడు.. దాన్ని మరింతగా ప్రచారం చేసుకోవడానికి ఎందుకు వెనుకాడుతారు. కాకపోతే.. తమ పైచేయిని గురించి అతిశయోక్తులు చెప్పుకోవడం మరీ హద్దులు దాటిపోతున్నప్పుడే.. జనం సాంతం అన్ని మాటలను నవ్వులాటగా తీసుకునే పరిస్థితి వస్తుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అడపాదడపా అయినా ప్రజాఉద్యమాలకు పిలుపు ఇస్తూ.. పాల్గొంటూ.. ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది జరిగిన ప్రతిసారీ.. సర్కారు వారి తరఫున మంత్రులు కొందరు విడతలుగా ప్రతిదాడులకు దిగడం రివాజుగా మారింది.
ఈసారి జగన్ అనంతపురం కేంద్రంగా రైతు అనుకూల ధర్నా నిర్వహించాడు గనుక.. దానికి జవాబు ఇవ్వడం నీటి పారుదల మంత్రి దేవినేని ఉమా బాధ్యత అయినట్లుంది. నిజానికి జగన్ ధర్నాలో ఉన్న ప్రధాన ఆరోపణ.. రాయలసీమకు నీళ్లు తెస్తా అనే విషయంలో చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీమలో ఒక్క ప్రాజెక్టుకు కూడా నీళ్లు రాలేదనేది జగన్ ఆరోపణ. అయితే దేవినేని ఉమా మాట్లాడుతూ.. సీమకు నీళ్లు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనంటూ కీర్తించారు.
అంతవరకూ అతిశయోక్తులు అయినా పరవాలేదు గానీ.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో పోటీచేసినా జగన్ కూడా గెలవలేని పరిస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారంటూ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో సాంతం రాష్ట్రమంతా వైకాపా అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ డిపాజిట్ కూడా రాదని పేర్కొనడం విశేషం. దేవినేని ఉమా జోస్యాలు బాగానే ఉన్నాయి గానీ.. మరీ తొందరపాటు జోస్యాల మాదిరిగా ఉన్నాయి.

