పాదయాత్రకు పక్కా ప్లానింగ్

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. దాదాపు మూడువేల కిలోమీటర్లు, ఆరు నెలల పాటు జరిగే ఈ పాదయాత్ర హైలెట్ కావాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ పాదయాత్ర వచ్చే నెల 2వతేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. అయితే పాదయాత్ర జరిగే సమయంలో స్థానిక సమస్యలపై ఆందోళనలు నిర్వహించి నియోజకవర్గాన్ని రాజీకీయంగా హీట్ ఎక్కించాలని జగన్ ఇటీవల జరిగిన 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జుల సమావేశంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో చేరికలు కూడా పాదయాత్ర సమయంలోనే చేపట్టాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు టీడీపీ మాజీ నేతలు కూడా జగన్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఇప్పటి వరకూ వారి చేరికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభమైన తర్వాత చేర్చుకోవచ్చని జగన్ భావించారు.
యాత్రలోనే చేరికలు.....
కాని పాదయాత్ర సమయంలో చేరికలు ఎక్కువగా ఉంటే మరింత ఊపు వస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు. అందుకే నియోజకవర్గాల వారీగా చోటా, బడా నేతల జాబితాను తయారు చేసుకున్నారు. ఏ స్థాయి నేతనైనా ఆ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించినప్పుడు జగన్ సమక్షంలో చేరాలని పార్టీ వర్గాలు వారికి స్పష్టం చేశాయి. దీంతో వీలయినంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకుని పాదయాత్రకు మంచి ఊపు తేవాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో చేరికలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ఆ నియోజకవర్గంలో ప్రవేశించినప్పుడు అక్కడే ఆ నేతలకు జగన్ పార్టీ కండువాను కప్పుతారు. మొత్తం మీద జగన్ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరింత పకడ్బందీ ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.
- Tags
- జగన్ పాదయాత్ర

