పవన్ హైదరాబాద్ వదలి రారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచే తన కార్యకలాపాలను కొనసాగించేలా ఉన్నారు. ఏపీలో కార్యాలయం ఏర్పాటు అన్న యోచన పవన్ చేయడం లేదు. ఒక పక్క వైసీపీ అధినేత జగన్ రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచే పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం హైదరాబాద్ నుంచే తన పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బెజవాడలో కార్యాలయం ఏర్పాటు చేసినా తాను వెళితే సెక్యూరిటీ సమస్య తలెత్తుతుందని పవన్ భావిస్తున్నారు. విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి తనకు ఏమీ ఇబ్బంది లేదని, కాని తాను వచ్చినప్పుడు కార్యాలయంలోకి అభిమానులు చొరబడితే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే హైదరాబాద్ లోనే రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
పార్టీ కార్యాలయానికి ఆధునిక హంగులు.....
జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు కూడా పార్టీ బాధ్యులను పవన్ నియమించారు. తెలంగాణలో కూడా జనసైనికుల ఎంపిక జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 72లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో పాటు కొందరుసిబ్బంది మాత్రమే ఉంటారు. అయితే దీన్ని రెండు రాష్ట్రాలకూ ప్రధాన కార్యాలయంగా చేయాలని నిర్ణయించారు. పార్టీలోని అన్ని విభాగాలకూ ఇక్కడ స్థానం కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ కు ప్రత్యేక కార్యాలయం, మీడియా సమావేశాలు, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని ఆధునిక రీతిలో తీర్చిదిద్దుతున్నారు. సో.... పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచే పార్టీని నడుపుతున్నారన్నమాట.
- Tags
- పవన్ కల్యాణ్

