పవన్ కు ఈ సెంటిమెంట్ ఎందుకు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకున్నట్లుగానే అనంతపురం జిల్లాను ఎంచుకున్నారు. పవన్ కల్యాణ్ కు తొలినుంచి అనంతపురం అంటే మక్కువ ఎక్కువ. కరువు ప్రాంతం కావడం, అక్కడ ఎక్కువగా సమస్యలు తిష్ట వేసి ఉండటం, రైతన్నలు కూలీలుగా మారి వలస బాట పట్టడం వంటివి పవన్ ను కలిచి వేశాయంటారు. ఆయన తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అలాగే అనంతపురంలో తొలి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని కూడా పవన్ గతంలో ప్రకటించారు.
అనంత నుంచే అంతా.....
గతంలోనూ అనంతపురం జిల్లాలో పవన్ హోదా సభను నిర్వహించారు. జనసేన సైనికులకు తొలి ఎంపిక కూడా అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించారు. ఇలా అనంతపురం అంటే పవన్ కు సెంటిమెంట్ తో కూడుకున్నదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో తొలి నుంచి సినీ హీరోలకు లక్షల సంఖ్యలో అభిమానులుంటారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇలా అనంతవాసులు సినీ హీరోలను ఆదరిస్తారు. రాజకీయంగా కూడా సినీహీరోలను అనంత చేరదీస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ తాను అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీ ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. కాని సొంత నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మూడురోజులు పల్లెల్లో.....
ఈనేపథ్యంలో తెలంగాణలో పర్యటన పూర్తయిన తర్వాత అనంతపురం నుంచి పవన్ కల్యాణ్ కరువు యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం మూడు రోజులు అనంతపురంలో పర్యటనకు పవన్ ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రారంభించారు. ముఖ్యంగా గుత్తి రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయ నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. రెండు ఎకరాల్లో ఈ పార్టీ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రధానంగా పల్లె ప్రాంతాల నుంచే పవన్ యాత్ర కొనసాగనుంది. కరవు యాత్ర కావడంతో పల్లెల్లోకి వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడి జనసేనాని సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. మొత్తం మీద అనంత సెంటిమెంట్ ను పవన్ మరోసారి చూపారు.
- Tags
- పవన్ కల్యాణ్

