పవన్ అభిమానులను కట్టడి చేయలేకపోతున్నారే...?

సినీ జనానికి వుండే క్రేజ్ ఒక ఎత్తు అయితే హీరో పవన్ కళ్యాణ్ కి యువత లో వుండే ఇమేజ్ మరో ఎత్తు. ఆయన పబ్లిక్ లోకి వెళ్ళారంటే అటు పోలీసులకు, ఇటు బౌన్సర్లకు కార్యక్రమం పూర్తి అయ్యేవరకు తలప్రాణం తోకకు వచ్చేస్తుంది. తమ అభిమాన హీరోను చూసేందుకు ఆయనతో ఫొటో లు దిగేందుకు యూత్ చూపించే ఉత్సహం వారి ప్రాణాలు తీయడమే కాదు పవన్ కళ్యాణ్ కు ప్రమాదాలు తెచ్చి పెట్టేలా కనిపిస్తుంది. ఆయన సభలకు బారికేడ్లు విరకొట్టుకుని వేదిక ఎక్కేయాలను కోవడం, దగ్గరనుంచి చూడాలనుకోవడం, ప్రమాదకరమైన విధ్యుత్ స్తంబాలు ఎక్కి ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతూ మృత్యు ఒడికి చేరడం, ఇక రోడ్లమీద, రైల్వే పట్టాలపై సైతం కూర్చోవడం, డాబాలు, చెట్లు, పోల్స్ ఎక్కేయడం, తమ హీరో కాన్వాయి వెనుక పరిగెత్తడం, బైక్ సైలన్సర్లు పీకేసి ముగ్గురు నలుగురు అతివేగంగా వాటిమీద తిరగడం వంటి సాహస కృత్యాలు చేసి అభిమానులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 12 ఏళ్ళ వయస్సు నుంచి 22 ఏళ్ళ వయస్సు లో వున్న కుర్రకారు చేసే ఈ ఫీట్లు తేడా వస్తే వారి కుటుంబాలను విషాదంలో మునిగిపోతున్నాయి.
పికె సైన్యానికి క్రమశిక్షణ నేర్పాలి ....
తనను ప్రాణంగా చూసుకునే అభిమానులను పదిలంగా కాపాడుకోవాలిసిన బాధ్యత జనసేన అధినేత పై వుంది. ఈ అంశంలో జనసేనాని సీరియస్ గా దృష్టి పెట్టడంలేదని పలువురు విమర్శిన్నారు. క్రమశిక్షణ లేని సైన్యం అదుపుతప్పితే సమాజానికే సమస్యలని జనసేనాని గుర్తించాలని కోరుతున్నారు. పవన్ తన ప్రసంగాల్లో ఎక్కడా అభిమానులను హద్దులు మీరకుండా వుండాలని కోరడం లేదని అంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీ గోల ఎక్కువైంది. వైరైటీ సెల్ఫీలు తీసుకునే క్రమంలో పలువురు చనిపోవడం,గాయాలు పాలు కావడం జరుగుతుంది. గతంలో ప్రత్యేక హోదా కోసం పవన్ కాకినాడ సభలో ఒక వ్యక్తి చెట్టుపైనుంచి పడి చనిపోయాడు. అదే సంఘటనలో పలువురు గాయపడ్డారు. ఇలా అనేక చోట్ల అభిమానుల అత్యుత్సాహం వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. తాజాగా పవన్ పోలవరం పర్యటనలో ఆయన అభిమాని బైక్ ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. రాజమండ్రి టూర్ లో ఒక కానిస్టేబుల్ కాలు విరిగింది. పికె సభ ప్రాంగణంలో రైలు పట్టాలపై ఆయన అభిమానులు వందల్లో చేరడం అందరిని ఆందోళనకు గురిచేసింది. ఇలా అనేక చోట్ల పవన్ సభలు సమావేశాల్లో అభిమానులు వ్యవహరిస్తున్న తీరు ప్రమాదాలకు కారణం కావడమే కాదు జనసేన పరువు తీస్తుందని జనసేనాని ఎప్పుడు గుర్తిస్తారో ...
- Tags
- పవన్ కల్యాణ్

