పవన్ని రోడ్డు మీదికి రమ్మంటున్నారు!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో అలవాటుగా ఒక మాట చెబుతూ ఉంటారు. ఇతర పార్టీల గురించి ప్రస్తావించే సందర్భాల్లో వామపక్ష పార్టీలు అంటే తనకు ఎంతో అభిమానం ఉన్నదని, వారి భావజాలం తనకు చాలా ఇష్టమని ఆయన చెబుతూ ఉంటారు. బహుశా అలాంటి మాటలనే ఎడ్వాంటేజీగా తీసుకోదలచుకున్నారో ఏమో గానీ.. తాము చేస్తున్న ప్రజాందోళనలకు, ప్రజల సమస్యల గురించి చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఐ నాయకులు గురువారం నాడు పవన్ కల్యాణ్ ను కలిసి కోరారు. ఇప్పటిదాకా కేవలం సభలు పెట్టి లేదా ప్రెస్ మీట్ లు పెట్టి, లేదా ట్వీట్లు కొట్టి మాత్రమే తన అభిప్రాయాలు, విమర్శలు తెలియజేస్తున్న పవన్ కల్యాణ్ మరింత క్రియాశీలం కావాలని, ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోవాలని సీపీఐ నేతలు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ కు నేటి యువతరంలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడ సభ నిర్వహించినా అనూహ్యంగా సక్సెస్ అవుతూనే ఉన్నాయి. అలాంటి పవన్ కల్యాణ్.. నోట్ల రద్దును సమర్థిస్తూనే.. ప్రజలకు కష్టాలు కలగకుండా చూడాలని మాత్రం పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా మోదీ సర్కారు చేసిన వంచన విషయంలో మాత్రం ఆయన చాలా దృఢవైఖరితోనే ఉన్నారు. మోదీ సర్కారు పట్ల ఎలాంటి శషబిషలు లేకుండా, సానుభూతి చూపకుండా.. తన సభల్లో వారిని తూర్పార పట్టారు. భాజపా కు రుచించని రీతిలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల్లో నేరుగా పోటీచేస్తుందని కూడా ఆయన వెల్లడించారు.
ఇలాంటి నేపథ్యంలో సీపీఐ నాయకులు వచ్చి పవన్ కల్యాణ్ ను కలవడం, ప్రజా పోరాటాల్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరపరిణామంగా ఉంది. మరి వారి వినతిని పవన్ ఖాతరు చేస్తారా.. ఆయన నేరుగా ప్రజాపోరాటాల్లోకి రావడం సాధ్యమేనా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. కానీ పవన్ స్వయంగా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమిస్తే మాత్రం పోరాటం స్వరూపమే మారిపోతుందని , కేంద్రం ఖచ్చితంగా దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

