పళని పని ఇక అయిపోయినట్లేనా?

పళనిస్వామి పని అయిపోయినట్లేనా? దినకరన్ గెలుపుతో అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. దినకరన్ ఆర్కే నగర్ నియోజకవర్గంలో దూసుకుపోవడంంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో వాయిస్ కూడా మారింది. దినకరన్ మధురై నుంచి చెన్నై కి చేరుకోగానే ఎయిర్ పోర్ట్ కు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రావడం కూడా ఆశ్చర్యం కలిగించింది. జయ వారసుడిగా దినకరన్ నే ప్రజలు నమ్ముతున్నారన్న సంకేతాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా తర్జన భర్జన ప్రారంభమయింది.
స్వరం మారింది....
దినకరన్ కు మెజారిటీ భారీగా రావడంతో పళనిస్వామి వర్గంలోని ఎమ్మెల్యేల్లో స్వరం మారింది.దినకరన్ తో కలిసి పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. పళనిస్వామి మంత్రివర్గంలోని మంత్రి సెల్లూరు రాజు కూడా దినకరన్ ను కలుపుకుని వెళితేనే మంచిదని వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. దీంతో పాటు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. దినకరన్ గెలవడం ఖాయంగా కన్పిస్తోందని, వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకేలోని రెండు గ్రూపులూ ఏకమవుతాయని స్వామి అభిప్రాయపడ్డారు. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన సెంగొట్టియన్ కూడా దినకరన్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
స్లీపర్స్ సెల్స్....
దినకరన్ వద్ద ఇప్పటికే 20 మంది వరకూ ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం వెనక తన వద్ద మరింత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పకనే చెప్పారు. గతంలో కూడా దినకరన్ తనకు అధికార పార్టీలో స్లీపర్స్ సెల్స్ ఉన్నాయనడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికే కలసి పనిచేస్తున్నా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు. దీంతో అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారంతా తన వెంట వస్తారని దినకరన్ చెబుతున్నారు. త్వరలోనే అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు దినకరన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలు తమిళనాడులోని రాజకీయ సమీకరణాలను మార్చేస్తాయన్నది విశ్లేషకుల అంచనా.
- Tags
- పళనిస్వామి

