పరాకాష్ట భజనకు చిరాకెత్తిన మోదీ!

పొగడ్తలు చాలా తీయగా ఉంటాయి. ప్రపంచంలో పొగడ్తలకు పడిపోని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ప్రధాని నరేంద్రమోదీ అందుకు అతీతులైన వ్యక్తి ఎంతమాత్రమూ కాదు! ఆయన కూడా తన అనుచరులు, వందిమాగధులు తరచూ తనను హీరోగా కీర్తిస్తూ ఉంటే వాటిని ఎంజాయ్ చేస్తూ వచ్చిన వారే.. మీడియాలో తనను కీర్తించే కథనాలు వచ్చేలా చక్కటి ప్లానింగ్‌తో ప్రజాదరణను తీర్చిదిద్దుకున్నవారే! కాకపోతే.. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. భాజపా నాయకులు చేస్తున్న పరాకాష్ట భజనను ఆయన కూడా భరించలేకపోతున్నట్లుగా ఉంది. అందుకే సర్జికల్ దాడులతో మోదీ హీరో అయిపోయాడని ఆయన ఛాతీ 56 నుంచి వంద అంగుళాలకు పెరిగిందని చేస్తున్న ప్రకటనల్ని ఆయన తీవ్రంగా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవాళ ఢిల్లీలో భాజపా కీలక నేతలతో నిర్వహించిన ఒక సమావేశంలో నా ఛాతీ గురించి మీరెందుకు మాట్లాడుతారు.. అంటూ మోదీ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సర్జికల్ దాడుల నేపథ్యంలో మోదీకి క్రెడిట్ కట్టబెట్టడానికి మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఈ మాటలు అన్నారు. అయితే వాటిని మోదీ అచ్చమైన అతిశయోక్తులుగా భావించినట్లు తెలుస్తోంది.
అయితే.. ఇలాంటి సైన్యం సాధించిన విజయాలను రాజకీయంగా వ్యక్తులకు ఆపాదించుకుని, తాము కీర్తి పొందాలనుకోవడం తప్పు అనే భావనతో మోదీ గనుక తను అనుచరులను నియంత్రించి ఉంటే ఆయనను శెభాష్ అనాల్సిందే. కేంద్రంలోని మంత్రులు ఎవ్వరూ కూడా దాడుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ మోడీ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

