పనులు చేయకుండానే డబ్బులు: చంద్రబాబుకు ఉండవల్లి సవాల్

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. చాలా పనులు చేయకుండా చేసినట్లు బిల్లులు పెట్టారని అరుణ కుమార్ ఆరోపించారు. తనదగ్గర దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని దమ్ముంటే ప్రభుత్వం తరపున ఎవరైనా వస్తే నిరూపిస్తా అని సవాల్ చేశారు ఉండవల్లి. అవాస్తవాలతో ప్రజల్ని ఎన్నాళ్ళు మభ్య పెడతారని, పోలవరం ప్రాజెక్ట్ పై వాస్తవ పరిస్థితిని వివరిస్తూ నిజాలు పంచుకోడానికి చంద్రబాబుకి ఇబ్బంది ఏమిటని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ప్రశ్నించారు. తాను మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి పలు అంశాలు లేవనెత్తుతూ శ్వేతపత్రం ఇవ్వాలని అడిగితే, అదేదో పెద్ద నేరం అన్నట్లు, అసలు పట్టించుకోనట్లు వ్యవహరిస్తూ వచ్చారని, అయితే టిడిపికి మిత్రుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోలవరంపై శ్వేతపత్రం ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని అడిగిన దానికి ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. రాజమహేంద్రవరం వై.జంక్షన్ ఆనం రోటరీ హాలులో శనివారం ఉదయం పొడిపిరెడ్డి అచ్యుత దేశాయ్, చెరుకూరి వెంకటరామారావు,అల్లు బాబి, బండారు మధు, లింగంపల్లి వెంకటేశ్వరరావు,కృష్ణ తదితరులతో కల్సి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి కేబినెట్ నిర్ణయాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాల కన్నా, తనదగ్గరే ఎక్కువ సమాచారం ఉందన్నారు. ఎంతో కీలకమైన సమాచార హక్కు చట్టం విప్లవాత్మక మార్పులు తెస్తుందని, అవినీతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తే, రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం దీన్నుంచి ఎలా బయట పడాలా అనేవిధంగా వ్యవహరిస్తోందని ఆయన వాపోయారు.
అన్నీ తప్పులు...తడకలే...
ఇక ఇటీవల కేంద్రమంత్రి గడ్గరి తో జరిగిన సమావేశంలో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకున్న ట్రాన్స్ ట్రాయ్, పోలవరం అధారిటీ విడివిడిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చాయని ఉండవల్లి చెబుతూ వీటికి సంభందించిన హార్డ్ కాపీలు తనవద్ద ఉన్నాయన్నారు. ప్రభుత్వం చేసిన ఆలస్యం కారణంగా, జూన్ 2020నాటికి ప్రాజెక్ట్ అవుతుందని, అదికూడా తగినంత పని మాత్రమే అవుతుందని ట్రాన్స్ ట్రాయ్ స్పష్టం చేసిందన్నారు. కాపర్ డ్యామ్ 2020డిసెంబర్ కి గాని,మార్చి2021గాని అవ్వదని కూడా చెప్పిందన్నారు. మరి పోలవరం అధారిటీ విషయానికొస్తే,ఏ ఏ పనులు,ఎంతెంత జరిగాయో,వాటికీ ఎంతెంత ఇచ్చారో, ఇంకా ఎంత చేయాలో ప్రజెంటేషన్ ద్వారా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకారమే ఇచ్చిన బిల్లులకు అక్కడ పని అయిందా లేదా అనేది చూస్తే,పని అవ్వకుండా బిల్లులు చెల్లించినట్లు అనుమానంగా ఉందని, ఇదే విషయాన్ని నిరూపించడానికి సిద్ధంగా వున్నానని ఉండవల్లి చెబుతూ, ఇది ఆరోపణ గా భావించవద్దన్నారు. తన ఛాలెంజ్ ని స్వీకరించి,ప్రభుత్వం తరపున ఎవరో ఒక అధికారిని పంపాలన్నారు. ఒకవేళ తనది తప్పయితే ఒప్పుకుంటానన్నారు.
అసలు లొసుగు ఎక్కడుంది?
నిజానికి విభజన వలన నష్టపోతున్న ఆంధ్ర ప్రదేశ్ ని ఆదుకోవాలంటే, జీవనాడి అయిన పోలవరం కట్టే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో హామీ ఇచ్చారని ఉండవల్లి మరోసారి గుర్తుచేస్తూ, దీని ప్రకారం పునరావాస పాకేజీ ఖర్చు కూడా కేంద్రమే భరించాల్సి ఉందన్నారు. అయితే 2014 రేట్లప్రకారమే ఇస్తామని కేంద్రం చెబుతుంటే, చంద్రబాబు ఎందుకు అడగడం లేదని ప్రశించారు. కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు ప్రకటిస్తూనే, రెండు రోజులు పోయాక,కేంద్రాన్ని ఏమీ అనవద్దని చెప్పడం చూస్తుంటే అసలు లొసుగు ఎక్కడుందని, ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. శ్వేతపత్రం ఇమ్మంటే, అదేదో అన్యాయం అయిపోయినట్లుగా, ప్రాజెక్ట్ ఆగిపోయినట్లుగా భావిస్తే ఎలాగన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించి , ప్రజల మద్దతు తీసుకోవాలే గానీ, మభ్యపెట్టడం భావ్యం కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తప్పుదోవ పట్టించాలని చూస్తే, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. 2017మే నాటికి ప్రాజెక్ట్ అంచనా వ్యయం 46వేల925కోట్లు ఉండగా, నవంబర్ నాటికి 58వేల319కోట్లకు ఎలా పెంచారని పోలవరం అధారిటీ సి ఇ ఓ అమర్జీత్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారని, అంటే రాష్టాన్ని కేంద్రం అడిగినట్లేనని ఉండవల్లి అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ ఇచ్చిన రెండు అడ్రెస్ లలో హైదరాబాద్ శ్రీనగర్, కమల నగర్ లోని సత్యసాయి నిగమాగమం దగ్గర ఇచ్చిన అడ్రెస్ గురించి వాకబు చేస్తే, అసలు ఏడేళ్లుగా ఇక్కడ అలాంటి ఆఫీసు లేదని తెలిసిందని ఆయన వాపోయారు.
బాబు చెప్పిందే శ్వేతపత్రమా?
ఇంట్లో స్లాబ్ వేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, స్లాబ్ రోజున అదనపు పనివాళ్లను పెట్టి స్వయంగా చూసుకుంటామని, అలాంటిది పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అజాగ్రత్త వహిస్తే ఎలాగని,ఒకవేళ లీకులు వస్తే, మనుషులు మిగులుతారా అని ఉండవల్లి ప్రశ్నించారు. శ్వేతపత్రం అడిగితే, అసెంబ్లీలో తనుచెప్పిన విషయమే శ్వేతపత్రం కింద లెక్కని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. విపక్షం లేకుండా ఏకపక్షంగా అసెంబ్లీ సాగిందని, గట్టిగా అడగాల్సిన విపక్షం వైసిపి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడం శోచనీయమని ఉండవల్లి పేర్కొంటూ కనీసం 184నిబంధన కింద పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని వైసిపికి ఆయన సూచించారు. అప్పుడు అందరూ కలసివస్తారని, ఒకవేళ రాకపోతే వాస్తవాలు ప్రజలు గమనిస్తారని ఆయన అన్నారు.
- Tags
- ఉండవల్లి

