పండగలా నువ్వొస్తావా.. అమ్మా..

తమిళనాడులో ఈ దీపావళి నిజంగానే అన్నాడీఎంకే పార్టీ వారికి, అమ్మ అభిమానులకు సంబరాలు తీసుకొస్తుందనే అనిపిస్తోంది. నిన్నమొన్నటివరకూ అమ్మ కోలుకున్నారనే వార్తలు వినిపించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు అమ్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారని.. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రకటించారు. దీంతో జయలలిత దీపావళికి ముందే ఇంటికి చేరుకోబోతున్నారంటూ సంబరాలు స్టార్ట్ చేశారు ఆమె అభిమానులు. నెల క్రితం.. 22న ఆస్పత్రిలో జ్వరం, డీహైడ్రేషన్ తో ఆస్పత్రిలో చేరిన జయలలిత మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆస్పత్రి వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి.
సీఎం కోలుకున్నారని.. వెంటిలేటర్ తొలగించడంతో మామూలుగా శ్వాస తీసుకుంటున్నారని కూడా చెబుతున్నాయి. జయలలితకు ప్రస్తుతం సింగపూర్ వైద్యులు స్పెషల్ ఫిజియోథెరపీ చేస్తున్నారట. లండన్ వెళ్లిన వైద్యుడు కొన్ని రోజుల్లో రాగానే.. జయను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలనేది నిర్ణయించాలనుకుంటున్నారు. అమ్మ కోలుకోవడం వల్లే హెల్త్ బులెటిన్లు విడుదల చేయాల్సిన అవసరం కూడా రాలేదంటున్నారు.
సోషల్ మీడియా వదంతులతో అమ్మకు ఏమైందోనని ఆందోళన చెందిన అభిమానులకు, అనుచరులకు నిజంగా దీనికంటే సంతోషకరమైన వార్త వేరే ఉండదేమో.. దీపావళి లోపు అమ్మ ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటే.. అది వారికి నిజంగా పండగ కానుకే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మైలేజీ రాకుండా జయ ఆరోగ్యంపై తరచూ సందేహాలు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేసిన విపక్షాలకు మాత్రం ఇది కచ్చితంగా చేదు మాత్రే. ఇప్పుడు జయలలితకు ఎంజీఆర్ తో పోలిక కూడా తీసుకొస్తున్నారు కొందరు వీరాభిమానులు. ఎంజీఆర్ ఆస్పత్రిలో చేరినపుడు కూడా ఇప్పటిలాగే ఎన్నో వదంతులు వచ్చాయని.. తర్వాత ఆయన కోలుకుని మళ్లీ సీఎం అయ్యారని చెబుతున్నాయని.. అంటే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక.. జయ ఛరిష్మాకు తోడు సానుభూతి కూడా ఆ పార్టీకి కలిసి రావచ్చు.

