నోట్ల పర్వంలో తాజా దెబ్బలు.. సానుకూలతలు!

ప్రజల నోటు కష్టాలు , బ్యాంకుల వద్ద పెరుగుతున్న క్యూలైన్లు ఇతరత్రా ఇబ్బందుల గురించి విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తుండగా.. మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తూ కేంద్రం గురువారం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించినట్టే.. గురువారం సాయంత్రం హఠాత్తుగా పాత నోట్ల మార్పిడి అనేది కేవలం అర్ధరాత్రి వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, శుక్రవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో వేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చేసింది.
అయితే ప్రజల ఇబ్బందులను మరి కొంత కాలం దూరం చేయడానికి కొన్ని తాజా నిర్ణయాలను కూడా కేంద్రం ప్రకటించింది. రద్దయిన నోట్లు మందుల షాపులు, రైల్వే టికెట్లు, పెట్రోలు బంకులు వంటి చోట్ల మాత్రం చెల్లుబాటు అయ్యేలా వెసులుబాటు కల్పించారు. అలాగే డిసెంబరు 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల టోల్ ట్యాక్సు వసూళ్లను కూడా రద్దు చేసేశారు.
ఈ నిర్ణయాల వల్ల ప్రధానంగా బ్యాంకుల వద్ద క్యూలైన్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. నోట్ల మార్పిడికి ప్రతిరోజూ చాలా పెద్ద సంఖ్యలో జనం క్యూల్లో చేరుతూ ఉన్న నేపథ్యంలో.. నోట్ల మార్పిడిని రద్దు చేయడం బ్యాంకు డిపాజిట్లకు మాత్రమే అనుమతించడం వల్ల క్యూలు అంతగా కనిపించవు.
గురువారం సాయంత్రం కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై నోట్ల రద్దు పర్యవసానంగా ప్రజలు పడుతున్న కష్టాల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నవంబరు 8 తర్వాత బ్యాంకు డిపాజిట్లపై ఆదాయపు పన్ను విదించడానికి అనుకూలంగా చట్టసవరణ చేసేలా కూడా కొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

