నోటు మారిస్తే రంగు పడుద్ది!

నోటు మారిస్తే రంగు పడుద్ది!
బ్యాంకుల వద్ద నగదు మార్పిడి చేసుకోవడానికి ప్రజల క్యూలైన్లు కొన్ని కిలోమీటర్ల పొడవున ఏర్పడిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచి ప్రజలు వచ్చి.. చలిలో వణుకుతూ బ్యాంకులు తెరిచేవరకు గేట్ల వద్ద పడిగాపులు కాయడం జరుగుతోంది. అయితే ఇంత అనూహ్యమైన, అవాంఛితమైన రద్దీ ఏర్పడడానికి కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నట్లు బ్యాంకులు, ఆర్థిక శాఖ గుర్తించాయి. ఒకసారి నగదు మార్పిడికి వచ్చిన వారే మళ్లీ క్యూలైన్లో వస్తున్నారని అందువల్లే రద్దీ పెరుగుతోందని గుర్తించారు. ఒకసారి నగదు మార్పిడికి వచ్చిన వారికి ఓటు వినియోగించుకునేప్పుడు వేసినట్లుగా ఇంకు గుర్తు వేయాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి ఏర్పాటు వల్ల.. రిపీట్ అయ్యే కస్టమర్లు తగ్గుతారు. బ్యాంకుల వద్ద క్యూలైన్లు తగ్గుతాయి అని ఊహిస్తున్నారు.
నోట్ల రద్దు వలన ఎదురవతున్న ప్రజల కష్టాలను , సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. ఇలా నోట్ల మార్పిడికి ఒకసారి వచ్చిన వారికి రంగు వేయాలని నిర్ణయించారు. అంటే పెంచిన పరిమితి ప్రకారం.. నోట్లమార్పిడికి వెళితే 4500 రూపాయలు తీసుకోవచ్చు. మళ్లీ రావడానికి వీలులేకుండా చేశారన్నమాట. ఒకసారి బ్యాంకులో నగదు మార్చుకున్న వారు.. మళ్లీ చేతికి వేసిన రంగు పోయే లోగా నగదు కావాలనుకుంటే ఏటీఎంల మీద ఆధారపడాల్సిందే.
అయితే ఏటీఎంలలో డబ్బు కొరత, సాఫ్ట్వేర్ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. కొత్త నోట్లు ఊర్లకు చేరుకున్నాయి. ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎంల వెసులుబాటుతో పాటూ, బ్యాంకుల్లో ఇలా రంగు వేసే ఏర్పాటువల్ల ప్రతి చోటా క్యూలైన్లు ఖచ్చితంగా తగ్గుతాయని అందరికీ అవకాశం లభిస్తుందని అనుకోవచ్చు.

