నోటిదురుసు కొంప ముంచింది

పెదవి దాటని మాటకు ప్రభువు నీవు ... పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అని పెద్దల మాట చద్దిమూటే. తాజాగా ఒక టివి ఛానెల్ ఇటీవల నిర్వహించిన ప్రత్యేక హోదాపై చర్చ కేసులవరకు వెళ్ళింది. నటుడు, రచయితా పోసాని కృష్ణ మురళి తో జరిగిన చర్చ సందర్భంగా లైవ్ డిస్కషన్ లో సదరు ఛానెల్ యాంకర్ మహిళలను కించపరిచేలా ముఖ్యంగా సినీ హీరోయిన్స్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మా అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా ఆధ్వర్యంలో నటీమణులు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేశారు. నటి హేమా ,యాంకర్ నటి జాన్సీ నేతృత్వంలోని బృందం ఈ ఫిర్యాదు చేసిన వారిలో వున్నారు. హీరోయిన్స్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యాంకర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అభ్యర్ధించారు.
కేసులకు దారి తీస్తున్న టివి చర్చలు...
ఇటీవల టివి ఛానెల్స్ నిర్వహిస్తున్న చర్చలు పోలీస్ స్టేషన్లలో కేసుల వరకు దారితీస్తున్నాయి. కొన్ని ఛానెల్స్ రేటింగ్స్ కోసం సున్నితమైన కుల మత అంశాలపైనా, ఇంకా ముందుకు పోయి లైంగిక అంశాలతో కూడిన చర్చలు వివాదాలు, విద్వేషాలు అన్నింటిపై చర్చలు చేపడుతున్నాయి. చర్చలు తప్పు కానప్పటికీ అందులో పాల్గొనే వక్తలు కానీ సదరు చర్చ నిర్వహించే యాంకర్ ఒక్కోసారి శృతి మించుతుండటంతో వివాదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఒక్కసారి ఈ చర్చల్లో పాల్గొనని వారు సైతం సదరు చర్చల్లో వచ్చిన అభ్యంతరకర అంశాలపై పోలీస్ స్టేషన్లు, కోర్ట్ లకు ఎక్కుతున్నారు. ఇలాంటి వివాదాలే ఇటీవల రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో ఎదురైంది. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఎపి, తెలంగాణ లలో మహిళలు కేసులు పెట్టేలా చేశాయి. ఆయన కూడా ఒక ఛానెల్ యాంకర్ పై కేసుకు సిద్ధం అయ్యారు. ఇక ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై ఇలాగే వ్యవహారం నడిచింది. టివి చర్చలో పాల్గొని వెళుతున్న మహేష్ కత్తిపై కోడిగుడ్ల తో పవన్ అభిమానులు కొందరు దాడి చేశారు. అది కేసుల వరకు వెళ్ళి చివరికి ఇద్దరి నడుమ రాజీ కుదిరింది.
సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నాయి ...
రేటింగ్ పోరాటంలో ఛానెల్స్ సాగిస్తున్న పోరాటం అత్యంత దారుణంగా ఉంటుంది. ఎంతో ఘోరంగా జరిగింది ఈ సంఘటన అని అందులో బాధితులు తిరిగి సమాజంలో తలెత్తుకోలేని రీతిలో కథనాలు వండివారుస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ను పాటించే ఛానెల్స్ కరువయ్యాయి. బాధితురాలు కానీ నిందితురాలిని కానీ విచారణ పూర్తి అయ్యే దాకా స్క్రీన్ పై చూపకూడదు. చుపించాల్సి వస్తే బ్లర్ చేసి చూపించాలి. కానీ చాలా ఛానెల్స్ ఈ అంశాన్ని పక్కన పెట్టేయడం యథేచ్ఛగా చేస్తున్నాయి. నేరం ఘోరం అంటూ పదే పదే మానవ బలహీనతనే తమ పెట్టుబడిగా వ్యాపారం చేసేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఛానెల్స్ లో నడిచే కథనాలు, చర్చల ఫలితంగా శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడుతుంది. దాంతో ఆయా ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలు సైతం పోలీసులు బంద్ చేసే పరిస్థితి తలెత్తుతుంది.
ఎవరు గీస్తారు లక్ష్మణ రేఖ ....
మీడియా నియంత్రణ అన్నది భావ ప్రకట స్వేచ్చకు విరుద్ధం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు దుర్వినియోగం అవుతున్న దుస్థితిలో మీడియా స్వీయ రక్షణ రేఖను తమకు తాము గీసుకోవడం పోటీ ప్రపంచంలో అసాధ్యం గా మారింది. ప్రభుత్వం కానీ కోర్ట్ లు కానీ ఆంక్షలు పెడుతున్నా మీడియా గొంతు నొక్కుతున్నారనే దాడికి భయపడి వెనుకంజ వేస్తున్నాయి. దాంతో సమాజానికి ఏ మాత్రం ప్రయోజనం లేని అంశాలనే కొన్ని ఛానెల్స్ తమ రేటింగ్స్ కోసం రోజంతా నడిపిస్తున్నాయి. అవసరమైతే రేటింగ్స్ కోసం దాడులు సైతం స్వయంగా పురమాయించుకునే తీరుకి తెలుగు మీడియా దిగజారిపోయింది. అలాగే ఒక ఛానెల్ తీరుపై మరో ఛానెల్ చర్చ కార్యక్రమాలు పెట్టుకునే సంస్కృతి దిగజారిన మీడియా దుస్థితికి దర్పణం పడుతుంది. దాంతో సమాజంలో మీడియా పై విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా తప్పుడు వార్త, చర్చ, వ్యాఖ్య ఛానెల్ లో ఇలా వచ్చిందో లేదో ఇక సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్స్ ఒక ఆట ఆడుకుంటున్నా అది కూడా రేటింగ్ లో భాగంగానే చూస్తున్నారు కానీ తమ తప్పులను ఛానెల్స్ దిద్దుకునే ప్రయత్నాలు చేయకపోవడం విచారకరం.
