నేడు ఏపీలో ఏం జరుగబోతోంది?

కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేడు ఏపీ బంద్ కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, విభజన హామీలను నెరవేర్చకుండా, కనీస నిధులను విడుదల చేయకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఈ బంద్ ను తలపెట్టారు. రాష్ట్ర బంద్ తోనైనా కేంద్రం తలవంచేలా చేయాలని వామపక్ష పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు వ్యాపారసంస్థలు, ప్రయివేటు విద్యాసంస్థలు తమ బంద్ కు సహకరించాలని వారు కోరుతున్నారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టీరీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపై కేంద్రం నాటకాలాడుతోందని విమర్శించారు.
బంద్ కు వైసీపీ మద్దతు...
ఈ బంద్ కు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇస్తామన్నారని, తర్వాత ఆ ప్యాకేజీకి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం లేదని వైసీపీ చెబుతోంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిని అవలంబిస్తుందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులను సక్రమంగా విడుదల చేయడంలేదన్నారు. విభజన సమస్యలపై తాము గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బంద్ లో వైసీపీ శ్రేణులందరూ పాల్గొని కేంద్రానికి సెగ తగిలేలా చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
పోలీసులు అప్రమత్తం....
అలాగే పది వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఇంకా మౌనంగా ఉంటే చేతకాని వారికింద జమకడతారని, ఆంధ్రుల సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేయాలని ఆయన కోరారు. కాగా ఈరోజు వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు బంద్ కు పిలుపు నివ్వడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించ అక్కడ అదనపు బలగాలను మొహరించారు. ఈ బంద్ కు ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
టీడీపీ కూడా నిరసనలు....
అయితే ఈరోజు టీడీపీ కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. మండల, జిల్లా కేంద్రాల్లో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు నిచ్చింది. విభజన హామీల కోసం ఎంపీలు గత నాలుగు రోజులుగా పార్లమెంటులో పోరాడుతున్నారని, వారికి సంఘీభావంగా పెద్దయెత్తున ఏపీలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే బంద్ కు మద్దతిస్తున్నట్లు టీడీపీ ప్రకటించలేదు.
జనసైనికులు కూడా....
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నేటి ఏపీ బంద్ పై స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించని రీతిలో, శాంతియుతంగా జనసైనికులు బంద్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, అందువల్లనే నేడు తలపెట్టిన వామపక్షాల బంద్ కు తాను మద్దతిస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. శాంతియుతంగా పాల్గొనాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.
- Tags
- ఏపీ బంద్

