నెటిజెన్ల ఫేవరేట్ గా రేవంత్ ...!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ మారిన వారు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామాలు చేసింది లేదు. ఏపీలో టిడిపి, తెలంగాణలో టిఆర్ ఎస్ లు పక్క పార్టీ వారిని తమ పార్టీలోకి లాక్కొచ్చి మంత్రి పదవులు సైతం ఇచ్చి స్పీకర్ లను అడ్డుపెట్టుకుని విలువలు తొక్కేశాయి. ప్రస్తుతం ఈ టాపిక్ తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఇద్దరి వల్ల మళ్ళీ బయల్దేరింది. వారిద్దరే వైసిపి అధినేత జగన్ , టిడిపికి , తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యేలపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీ గుమ్మం తొక్కేది లేదని వైసిపి రేవంత్ ఎపిసోడ్ కి ముందే ప్రకటించి టిడిపి సర్కార్ ను డిఫెన్స్ లో పడేసింది.
రేవంత్ కి జనం జేజేలు .......
తాజాగా రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి ప్రజల్లో హీరోగా నిలిచారు. ముఖ్యంగా సోషల్ మిడియా అంతా పార్టీలకు అతీతంగా రేవంత్ కి జేజేలు పలికింది స్వాగతించింది. ఇది అటు టి సర్కార్, ఇటు తెలుగుదేశానికి ఒకేదెబ్బకు అబ్బా అనిపించేలా గూబ గుయ్యిమనిపించే చర్యే. ఇప్పుడు దీనిపై రెండు ప్రభుత్వాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ప్రజల్లో ఫిరాయింపు ఎమ్యెల్యేలపై వ్యతిరేకత....
పార్టీ మారినప్పుడు రాజీనామాలు చేయకుండా కొనసాగే వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతే వుందన్నది రేవంత్ ఎపిసోడ్ లో రుజువైంది. సోషల్ మీడియా లో రేవంత్ చర్యపై హర్షాతీరేకాలు వ్యక్తం కావడమే దీనికి నిదర్శనం. ఫిరాయింపులపై రేవంత్ న్యాయస్థానాలకు సైతం వెళ్ళి పోరాడుతుంటే ఏపీలో ఆయన ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన టిడిపి అనైతిక చర్యలకు దిగి వైసిపి ఎమ్యెల్యేలను రాజీనామాలు చేయకుండా పార్టీలోకి చేర్చుకోవడం చర్చనీయాంశం అయ్యింది. రెండు ట్లేగ రాష్ట్రాల్లో యథేచ్ఛగా ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజకీయాల్లో తిరిగే వారిపట్ల ప్రజలు చిన్నచూపు చూసేలా చేసింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి పక్కపార్టీలోకి వెళ్లడాన్ని అందరు ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నా రెండు ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విశేషం.
- Tags
- రేవంత్

