నితీష్ పేరు అందులో లేకపోవడమేమిటి?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా సాగుతోంది. ఇటు రాహుల్, అటు ప్రధాని మోడీ ప్రచారానికి దిగుతున్నారు. కేంద్రమంత్రులందరూ గుజరాత్ లోనే పర్యటిస్తున్నారు. కాని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదట. బీజేపీ, జేడీయూ బీహార్ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నాయి. లాలూ పార్టీతో కటీఫ్ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో వెంటనే బీజేపీ నితీష్ కు అండగా నిలిచింది. రేపో మాపో కేంద్రమంత్రివర్గంలో చేరేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ప్రచారానికి రాకూడదనుకున్నారా?
గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా జేడీయూ యాభై స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. అయితే గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసే నేతల జాబితాను గుజరాత్ జేడీయూ నేతలు విడుదల చేశారు. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పేరు లేకపోవడం గమనార్హం. గుజరాత్ ఎన్నికల్లో ప్రచారానికి నితీష్ రాకపోవడానికి కారణాలేంటన్నది ఎవరికీ అర్థంకాకుండా ఉంది. గుజరాత్ లో బీజేపీ గెలుస్తుందని ఇటీవలే నితీష్ జోస్యం చెప్పారు. బేజేపీకి అంత విజయావకాశాలుంటే నితీష్ ఎందుకు ప్రచారానికి రావడం లేదన్న ప్రశ్న తలెత్తుంది. దీనిపై బీహార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సూటిగానే ప్రశ్నించారు. గుజరాత్ లో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం నితీష్ కు పోయినట్లుందని ఆయన చమత్కరించారు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల ప్రచారానికి నితీష్ వస్తారా? రారా? అన్నది స్పష్టంగా తెలియక పోయినా... ప్రచారంలో పాల్గొనే జేడీయూ నేతల జాబితాలో నితీష్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
- Tags
- నితీష్ కుమార్

