నిజంగానే ఏపీ సర్కార్ అలా చేస్తుందా ..?

చదువుకోవడం అనడం కన్నా చదువుకొనడం అనడం ఉత్తమం అనే స్థాయికి విద్యా వ్యవస్థ దిగజారింది. ఈ విద్యా వ్యాపారం మాట ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు తీవ్ర వత్తిడికి గురయి నిత్యం ఎక్కడో అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి నివారణకు ప్రభుత్వ చిత్తశుద్ధి అంతంత మాత్రంగా ఉండటంతో ఈ ప్రధాన అంశంపై ఏపీ అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చ నడిచింది. టిడిపి, బిజెపి శాసనసభ్యులు కార్పొరేట్ విద్యా సంస్థల దందాను సభలో తూర్పారబట్టాయి. దీనిపై సమాధానం చెప్పడానికి విద్యా శాఖామంత్రి తీవ్ర ఇబ్బందికే లోనయ్యారు. ఆయన వియ్యంకుడు నారాయణ విద్యా సంస్థల్లోనే ఎక్కువమంది ప్రాణాలు విడుస్తున్న పరిస్థితిలో గంటా ఇబ్బంది పడ్డారు.
కఠిన చర్యలు ... భారీ జరిమానాలు ....
మార్కుల కోసం వత్తిడికి గురయి పిట్టల్లా రాలిపోతున్న దుస్థితిపై ఇకపై విద్యా మాఫియా పై కఠిన చర్యలు తప్పనిసరని మంత్రి గంటా స్పష్టం చేశారు. శాసనసభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు ఆయన. రాష్ట్రంలో అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు చైతన్య, నారాయణపై భారీ గా ఇప్పటికే జరిమానాలు విధించామని తెలిపారు విద్యా శాఖామంత్రి. అలాగే పెనాల్టీ తో బాటు ఆయా విద్యా సంస్థల అనుమతులు సైతం రద్దు చేసినట్లు చెప్పుకొచ్చారు గంటా శ్రీనివాస రావు.
పిల్లలను రోబోలు చేయకండి ...
ఈ చర్చలో పాల్గొన్న సీఎం విద్యార్థులను మార్కుల కోసం మరబొమ్మలు గా మార్చొద్దని తల్లితండ్రులకు హితవుపలికారు..రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇకపై తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు చంద్రబాబు. చర్చలో కొందరు ఎమ్యెల్యేలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అసలు ప్రభుత్వ విద్యా సంస్థలకు వున్న నిబంధనలు కార్పొరేట్ కళాశాలకు ఎందుకు వర్తింప చేయరని నిలదీశారు.
- Tags
- ఏపీ సర్కార్

