నారాయణ... నారాయణ ...ఇదేంటి ...?

సిపిఐ నారాయణ పేరు వినగానే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. నారాయణ మాటలే కాదు చేష్టలు సైతం వివాదాస్పదమే. ఆయన చేసే చర్యలు వార్తల్లో హెడ్ లైన్స్ గా వస్తాయి. మరి అలా రావాలని చేస్తారో లేక ఆయన చేసిన పనులు పతాక శీర్షికలకు ఎక్కిస్తాయో కానీ ప్రజలు ఆమోదించని పార్టీలో వున్నా నారాయణ నిత్యం ఫైర్ బ్రాండ్ గానే చలామణి అవుతారు. తాజాగా తెలంగాణ లో నిర్వహించిన సభలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.
కేటీఆర్ ఇవాంకా ను చూసి ...
ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కానీ పరిస్థితి. సభ్యత మరిచి అసభ్య పదజాలాన్ని నేతలు ఇటీవల ఎంచుకోవడం ఎక్కువైపోయింది. అలాంటి మాటలనే ఛానెల్స్ పదే పదే రేటింగ్స్ కోసం ప్రసారం చేసే వ్యవహారం నడుస్తున్న తరుణంలో తమ కవరేజ్ కోసం నేతలు మాస్ లీడర్స్ అవతారం ఎత్తుతున్నారు. దీనికి సిపిఐ నారాయణ అతీతులు కారు. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకను చూసి కేసీఆర్ తనయుడు కేటీఆర్ సొల్లు కార్చుకున్నాడని అది చూసి ఆమె అమెరికా రావాలని ఆహ్వానించిందని నారాయణ సెలవిచ్చారు. ఇసుక మాఫియా లీడర్ కేటీఆర్ అని, డ్రగ్స్ దందా వారే నడిపిస్తున్నారని నారాయణ రెచ్చిపోయి వ్యాఖ్యానించినప్పటికీ, ఇవాంక పై చేసిన కామెంట్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
నారాయణ శైలే విభిన్నం ....
సీపీఐ నారాయణ విలక్షణ నేత. గతంలో గాంధీ జయంతి నాడు కోడి కూర ఇడ్లీ తిన్నందుకు ప్రాయశ్చిత్తంగా ఏడాదిపాటు నాన్ వెజ్ కి ఆయన దూరం అయ్యారు. మరోసారి విశాఖ భూకుంభకోణం పరిశీలనకు వెళ్లిన నారాయణ అక్కడ టివి ఛానెల్స్ కెమెరాలు ఉన్నాయని తన వయస్సుకు మించిన తెంపరితనంతో గోడను తన్ని కాలు విరక్కొట్టుకున్నారు. అలానే చంద్రబాబు, కేసీఆర్ మోడీలపై ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు టీవీల్లో హల్చల్ చేసేవి. ఒక్కోసారి తన నోటి దురుసుకు క్షమాపణలు సైతం చెప్పుకోవాలిసి వచ్చేది. ఇప్పడు కేటీఆర్ పై తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్స్ ఎదురౌతాయో నారాయణ ఎపిసోడ్ లో చూడాలి మరి.
- Tags
- నారాయణ

