నాదెండ్ల మాటలకు జవాబివ్వకుంటే నష్టమే!

తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేయాల్సి వచ్చినప్పుడెల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున పలువురు నాయకులు మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. పీసీసీ చీఫ్ హోదాలో రఘువీరారెడ్డి నిరంతరాయంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చివరి స్పీకర్గా తనకంటూ ఒక గుర్తింపు కలిగి ఉన్న సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ పదేపదే మీడియా ముందుకు రావడం జరగదు. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో.. ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తున్నదంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా నాదెండ్ల మనోహర్ విమర్శలకు గనుక సూటిగా ప్రభుత్వం జవాబివ్వకుంటే.. ప్రభుత్వానికే పరువు పోయే పరిస్థితి ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.
విశాఖపట్టణంలో ఈ ఏడాది జనవరిలో పార్టనర్షిప్ సమ్మిట్ పేరిట ఏపీ సర్కారు ఓ పెద్ద సదస్సును నిర్వహించింది. ఈ సదస్సు పూర్తయ్యే సమయానికి మొత్తం అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తలతో 361 ఎంఓయూలో కుదిరాయని, 4.76 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలాగా రాబోతున్నాయని, 10,27,121 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని అప్పట్లో చంద్రబాబునాయుడు చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ఈ వివరాలను అన్నిటినీ గుర్తుచేసిన మాజీ స్పీకరు నాదెండ్ల మనోహర్.. ఈ పార్టనర్ షిప్ సమ్మిట్ అనేదే ఒక పెద్ద బోగస్ సదస్సు అని దాని వల్ల రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమ కూడా వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు ఇస్తున్న వివరాలే చెప్పడం లేదని విమర్శించడం విశేషం…
ఈ పార్టనర్షిప్ సమిట్ పేరిట జరిగిన మాయను నాదెండ్ల మనోహర్ వివరించారు. సమావేశానికి 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఒక్క డ్యాన్స్ ప్రోగ్రాంకే నకోటి రూపాయలు చెల్లించారని.. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దుబారా వ్యయం ద్వారా తమకు కావాల్సిన ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలకు చంద్రబాబు దోచిపెట్టారంటూ నాదెండ్ల మనోహర్ ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో 41 దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు వచ్చినట్టు చంద్రబాబు చెబితే, ఇటీవల వెలగపూడిలో యనమల రామకృష్ణుడు 600 మంది ప్రతినిధులు వచ్చినట్లుగా చెప్పారని.. పొంతనలేని ఈ లెక్కలు ఎవరిని మోసం చేయడానికి అని ప్రశ్నించారు.
సమిట్ పూర్తయి పదినెలలు గడుస్తుండగా.. ఒక్క ఎంఓయూ కార్యరూపం దాల్చిన పాపాన పోలేదని, ఆ 361లో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో నెలకొల్పబడలేదని నాదెండ్ల మనోహర్ చేసిన ఆరోపణలు నిజానికి అలాంటి సమిట్లు, వాటి తర్వాత చంద్రబాబు చేసే ప్రకటనలపై ఆశలు పెంచుకునే యువతను భయపెట్టే విషయాలే.
అయితే నాదెండ్ల మనోహర్ చాలా కీలకమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వాటికి నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ‘‘అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు.. అంతర్జాతీయ ఈవెంట్ చేసేప్పుడు ఘనంగా ఖర్చు పెడితే తప్పేమిటి’’ లాంటి టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రతివిమర్శలతో కాకుండా.. ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమకూడా రాలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. మరి, ఆ 361 ఒప్పందాలనుంచి ఎన్ని పరిశ్రమలు ఈ పదినెలల కాలంలో ఏర్పాటు అయ్యాయో ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా చెప్పాలి. లేకపోతే.. కనీసం ఇలాంటి వృథా ప్రయత్నాల జోలికి వెళ్లబోమంటూ లెంపలు వేసుకోవాలి. లేకపోతే వారిని ప్రజలు క్షమించరు.

