నల్లారి కోటలో జ‘‘గన్’’ పేలుస్తారా?

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ ఇలాకాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కుటుంబానికి పీలేరు నియోజకవర్గం పెట్టని కోట. అయితే గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అనంతరం ఈ సీటును నల్లారి కుటుంబం కోల్పోయింది. ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి సోదరుడిని పోటీ చేయించినా గెలవలేకపోయారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. దాదాపు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 71949 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 56636 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడోస్థానానికి పడిపోవడం విశేషం.
పీలేరులో ఉత్కంఠ....
అయితే ఇటీవలే పీలేరు నియోజకవర్గంలో రాజకీయాలు పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. నల్లారి కిషోర్ కుమార్ కుటుంబం టీడీపీలోచేరింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఇక్కడ టీడీపీ టిక్కెట్ దాదాపుగా ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో ప్రవేశించడంతో ఉత్కంఠ రేపుతోంది. ఇదే నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా పట్టుంది. నల్లారి కోటలో మరోసారి పాగా వేయాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. అందుకోసం వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నల్లారి కుటుంబం చేరికతో కొందరు టీడీపీ నేతల్లో అసంతృప్తి చోటు చేసుకుంది.
700 కిలోమీటర్లు దాటిన యాత్ర....
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 700 కిలోమీటర్ల మైలు రాయికి చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. జమ్మిల వారి పల్లి దగ్గర జగన్ పాదయాత్ర 700 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో అక్కడ మొక్కనాటిన జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. యాభైవ రోజు పాదయాత్రలో జగన్ 14.2 కిలోమీటర్ల మేరకు నడిచారు. పీలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో జగన్ యాత్రకు మంచి స్పందన కన్పిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జగన్ పాదయాత్రను దగ్గరుండి చూసుకుంటున్నారు.
- Tags
- జగన్

