నయీం ఎఫెక్ట్ : అన్ని పార్టీల నేతలకూ గుండెదడే!!

గ్యాంగ్ స్టర్ నయీం హత్య తర్వాత అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నేతలు, అధికారుల తొలి జాబితా విడుదలైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల భూ బాగోతం రట్టైంది. నయీంకు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన వారి నుంచి అతడికి సహకరించిన నేతలు, పోలీసు అధికారుల లిస్టు సేకరించిన సిట్ వారి పేర్లు విడుదల చేయడం మొదలు పెట్టింది.. వీరంతా నయీం అవసరాలకు సహకరించి భువనగిరి చుట్టుపక్కల తమకు నచ్చిన ప్రాంతాల్లో విలువైన భూములను కానుకలుగా అందుకున్నారు.. వీటిని తమ పేరున కాకుండా బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. సిట్ విడుదల చేసిన మొదటి లిస్టులో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్ పేరు బయటికొచ్చింది.. తన ఇంట్లో పనిచేసే నాగయ్య పేరు మీద భువనగిరి దగ్గర పదెకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ విచారణలో తేలింది.
భువనగిరికే చెందిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డి కూడా ఒక బిల్డర్ పేరు మీద పెదకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసినట్టు సిట్ బయటపెట్టింది.. నయీం హత్య తర్వాత అతడి డైరీలో ఎన్నో పేర్లు వెల్లడించినట్టు వార్తలు రాగా.. తొలి జాబితాలో బయటపడ్డ నేతల పేర్లు రెండే.. మిగతావి పోలీసు అధికారులవే. తొలి లిస్టులో ఆ రెండూ కూడా అధికార పార్టీ నేతలవే కావడంతో.. ఇక సర్కారు నెక్ట్స్ టార్గెట్ విపక్షాలే అనుకుంటున్నారు. నయీంకు సహకరించిన టీడీపీ, కాంగ్రెస్ నేతల పేర్లను విడుదల చేసే ముందు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.
అదే నిజమైతే.. సిట్ తర్వాత విడుదల చేయబోయే.. నయీం దోస్తుల జాబితాలో విపక్షాల నేతల పేర్లు భారీగా ఉండే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగానే నయీం డైరీలో ఉన్న అధికార పార్టీ నేతల పేర్లను మొదటి జాబితాలోనే విడుదల చేశారని, ముందు ముందు విపక్షాల బండారం బయటపెడారని అనుకుంటున్నారు. దీంతో నయీం అరాచకాలకు అండగా నిలిచిన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. పలువురు నేతలు, పోలీసులు, ఇతర అధికారులపై పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన సిట్ వారి అరెస్టులు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

