నగారా మోగింది : తెలంగాణ అసెంబ్లీ 16 నుంచి

మరో పదిరోజుల్లో శీతాకాలం తెలంగాణలో వేడెక్కనుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తాన్ని ప్రకటించింది. అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాల్సిందేనంటూ.. కొన్నిరోజులుగా విపక్షం కాంగ్రెస్ చాలా తీవ్ర స్వరంతో డిమాండ్ చేస్తూ వచ్చింది. వారి డిమాండ్ లకు వెరచేది లేదన్నట్లుగా కేసీఆర్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ప్రకటించేసింది. కలెక్టర్ల కాన్ఫరెన్సు 14న పూర్తయిన తరువాత, 16 వ తేదీనుంచి అసెంబ్లీ జరుగుతుంది. 15న బీఏసీ సమావేశం ఉంటుంది. విపక్షాలు చాలా ఆవేశంతో వేచిఉన్నట్లుగా ఉన్న తరుణంలో.. ఈ శీతాకాల సమావేశాలు ఖచ్చితంగా వేడివేడిగా జరుగుతాయనేది అంచనా.
కేసీఆర్ సర్కారును ఎన్ని రకాలుగా ఇరుకున పెట్టవచ్చుననే విషయంలో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ కసరత్తు చేస్తున్నదని చెప్పాలి. నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల సంగతి పట్టించుకోకుండా.. కేసీఆర్ వంద గదులతో భవంతి కట్టించుకున్నాడు అనేది వారి ప్రధాన ఆరోపణ. ఆ తరువాత.. రైతు సమస్యలు, ఫీజు రీఇంబర్స్ మెంట్ అనేవి వారికి ఎప్పటినుంచో ఉండనే ఉన్నాయి.
అయితే ఈసారి కాంగ్రెస్ నోట్ల రద్దు విషయంలోను , తెలంగాణను డిజిటల్ లావాదేవీల రాష్ట్రంగా మార్చాలనే కేసీఆర్ సంకల్పం విషయంలోనూ కూడా అసెంబ్లీలో నిలదీయాలని అనుకుంటోంది. కేంద్రంలోని భాజపా నిర్ణయాన్ని పార్లమెంటులో తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లే.. ఇక్కడ కూడా నిరసన గళం వినిపించాలనేది వారి ఆలోచన. మోదీ సంకల్పానికి కేసీఆర్ జైకొట్టడం, డిజిటల్ దిశగా అడుగులు వేస్తుండడం ఇదంతా.. ప్రజలను కష్టాల పాల్జేసేందుకే అనే వాదనతో కాంగ్రెస్ సభలో రాద్ధాంతం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే వారు ముందస్తు ప్రిపరేషన్ కూడా జరుగుతోంది.
అయితే విపక్షాలను ఖాతరు చేయకుండా.. తన పని తాను చేసుకుపోయే కేసీఆర్ శాసనసభలో తమ డిజిటల్ స్వప్నాలను ఆవిష్కరించే ప్రయత్నాలను ఎలా సమర్థించుకుంటారో, విపక్షాల నోటికి ఎలా తాళం వేస్తారో చూడాలి.

