దేవుడికి ధన్యవాదాలు తెలిపిన సోము
రాయలసీమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని బీజేపీ నేత సోమువీర్రాజు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేస్తానంటున్నచంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ చంద్రబాబు పూర్తి చేసి రాయలసీమకు న్యాయం చేయాలని ఆయన కడపలో కోరారు. కడప విమానాశ్రయంలో ఎవరి కారణంగా విమానాలు తిరుగుతున్నాయో అందరికీ తెలుసునన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆప్కాబ్ లో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందని, యూనిఫామ్ లు కుట్టించడానికి ఆప్కో ఛైర్మన్ గుజ్జల శ్రీనివాస్ 16 కోట్లు కమీషన్ దండుకున్నారన్నారు. సీఎం డ్యాష్ బోర్డు ట్రాష్ బోర్డు డ్రామా బోర్డుగా సోము వీర్రాజు అభివర్ణించారు. డ్యాష్ బోర్డులో ఉండేదానికి, క్షేత్రస్థాయిలో పనులకు పొంతన లేదని చెప్పారు. టీడీపీతో తాము మద్దతు ఉన్నంతకాలం చిత్రహింసలు అనుభవించామని, దేవుడి దయతో బయటపడ్డామని సోముఅన్నారు.