దినకరన్ వార్నింగ్...ఈపీఎస్..ఓపీఎస్.. అలర్ట్

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన అధికార పార్టీ అన్నాడీఎంకే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పరాజయం పాలవడంపై విశ్లేషించనున్నారు. ఇందుకు ప్రధాన కారణం దినకరన్ పెద్దమొత్తంలో డబ్బులు పంచడమేనన్నది వారి ఆరోపణ. దీంతో పాటు దినకరన్ తో డీఎంకే కుమ్మక్కయిందని, అందుకే డీఎంకేకు డిపాజిట్లు దక్కలేదని ఈపీఎస్, ఓపీఎస్ లు సమావేశంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దినకరన్ వ్యాఖ్యలే ప్రధానంగా...
అంతేకాకుండా దినకరన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. దినకరన్ ఆధిక్యంలో దూసుకువెళుతున్న సమయంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. దీంతోపాటు కొందరు మంత్రులు దినకరన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, కొందరు దినకరన్ ఇంటికి వెళ్లి కలుసుకోవడంపై కూడా ఈపీఎస్, ఓపీఎస్ లలో ఆందోళన ప్రారంభమైందంటున్నారు. అందుకోసమే ఎమ్మెల్యేలు తమ జారి పోకుండా ఉండేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలకు వరాలు....
ఎమ్మెల్యేలకు కొత్త ఏడాది ముఖ్యమంత్రి పళనిస్వామి వరాల జల్లు కురిపించే అవకాశముంది. దినకరన్ గూటికి చేరకుండా ఉండేందుకు ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందుకోసమే నియోజకవర్గాల వారీగా త్వరలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. వారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా వాటికి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించనున్నారు. మొత్తం మీద దినకరన్ వార్నింగ్ తో ఈపీఎస్, ఓపీఎస్ లు అప్రమత్తమయ్యారు. మరి దినకరన్ వర్గంలోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను ...
ఎంతకాలం కాపాడుకుంటారో చూడాలి.

