దావూద్ ను చావు దెబ్బ కొట్టాడే...!

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఆయన ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ షాకిచ్చాడు. గత రెండు రోజులుగా ఈ వార్తలు అంతర్జాతీయంగా హల్ చల్ చేస్తున్నాయి. డి గ్యాంగ్ కు ఇప్పటి వరకూ దావూద్ ఇబ్రహీం బాస్. ఈ గ్యాంగ్ కు సీఈవో గా చోటా షకీల్ ఉన్నారు. అయితే ఇప్పటికే డిగ్యాంగ్ బాధ్యతలను చూడటానికి దావూద్ కుమారుడు మెయిన్ నవాజ్ అంగీకరించలేదు. ఆయన మతప్రవక్తగా మారేందుకు సిద్ధమయ్యారు. దీంతో దావూద్ వారసత్వాన్ని ఛోటా షకీల్ కొనసాగిస్తారని అందరూ భావించారు. కాని ఛోటా షకీల్ కూడా డి గ్యాంగ్ నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దావూద్ ఇబ్రహీంకు ఇప్పటికే 63వ ఏడులోకి అడుగుపెట్టబోతోన్నారు. దావూద్ ను అనారోగ్యం పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో తనకు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్న ఛోటా షకీల్ కూడా దూరమవ్వడంతో దావూద్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తో్ంది.
సోదరుడు, షకీల్ మధ్య విభేదాలు....
దావూద్ ఆరోగ్యంపై కూడా గతంలో అనేక వదంతులు విన్పించాయి. దావూద్ కు కిడ్నీలు చెడిపోయాయని, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని చివరి దశలో ఉన్నారని అనేక వార్తలు వచ్చాయి. పాక్ లోని కరాచీలో నివాసముంటున్న దావూద్ అక్కడి నుంచే తన నేరసామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దావూద్ కు అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తుండటంతో కుమారుడు తన వారసత్వాన్ని కొనసాగించలేనని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో దావూద్ తన సోదరుడు అనీస్ కు గ్యాంగ్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలంగా అనీస్ గ్యాంగ్ కార్యకలాపాల్లో వేలు పెడుతున్నారు. ఇది చోటా షకీల్ కు రుచించలేదు. దీంతో చోటా షకీల్ కు, అనీస్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ఇంటలిజెన్స్ వార్గాలు గుర్తించాయి. తన సోదరుడిని దావూద్ హెచ్చరించినప్పటికీ అనీస్ విన్పించుకోకపోవడంతో చోటా షకీల్ వేరే గ్యాంగ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ గ్యాంగ్ ఆస్తుల విలువ దాదాపు నలభై వేల కోట్లు ఉంటుందని అంచనా. హవాలా వ్యాపారం, నకిలీ నోట్ల చెలమణీతో దావూద్ తన వ్యాపారాన్ని 20 దేశాలకు విస్తరించారు. అయితే పాక్ ఇంటలిజెన్స్ విభాగం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే అవకాశముందని సమాచారం.
- Tags
- దావూద్ ఇబ్రహీం

