తోట త్రిమూర్తులను అది ఇంకా వెంటాడుతుంది

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్యెల్యే తోట త్రిమూర్తులను శిరోముండనం కేసు ఇంకా వెంటాడుతుంది. ఈ కేసు ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతూ వస్తుంది. ఎమ్యెల్యే తోటకు ఈ కేసులో శిక్ష పడాలని బాధితులు, ఆయన ప్రత్యర్ధులు గట్టిగా పోరాడుతుంటే త్రిమూర్తులు దీనినుంచి బయటపడే అన్ని మార్గాలు వెతుకుతున్నారు. తాజాగా ఇటీవల కేసులోని బాధితులు దళితులే కాదని వారు క్రైస్తవ మతం తీసుకున్నందున బిసి సి కులానికి చెందిన వారుగా వస్తారని తహశీల్దార్, ఆర్డీఓ లు నివేదికను జెసికి పంపడాన్ని దళిత, ప్రజాసంఘాల నేతలు ఖండిస్తూ మరోసారి ఈ వ్యవహారంపై ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. బాధితులకు ఒక పాస్టర్ ఒత్తిడికి గురయ్యి క్రైస్తవులని చెప్పించారన్నది వారి ఆరోపణ. 1996 లో జరిగిన ఈ సంఘటనలో కేసును వీగిపోయేలా చేసేందుకు ఎమ్యెల్యే తోట చేయని ప్రయత్నం లేదని ఇప్పుడు కూడా బాధితులకు ఎమ్మార్వో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా త్రిమూర్తులు చేస్తున్న వత్తిడికి లొంగిపోతున్నారని దళిత సంఘాల ఆరోపణ.
పిపిని సైతం మార్చేశారు...
అధికారపార్టీ ఎమ్యెల్యేకు అనుకూలంగా లేరని ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరిస్తున్న జవహర్ ఆలీని గతంలో మార్చడం పైనా తీవ్ర దుమారం చెలరేగింది. కేసు కీలక దశలో జరిగిన మార్పుపై జవహర్ సైతం తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కారు. ఇలా దశల వారీగా అన్ని వైపులనుంచి ఎమ్యెల్యే తన పలుకుబడి ఉపయోగించి కేసును పూర్తిగా నీరుగారుస్తున్నారన్నది దళిత వర్గాల వాదం.
తీర్పు ప్రతికూలం అయితే సీటు గ్యారంటీ లేనట్లే ...?
దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్ట్టించిన ఈ కేసులో తీర్పు ఎమ్యెల్యేకు వ్యతిరేకంగా వచ్చే పక్షంలో తోట త్రిమూర్తులు పైకోర్టు కి అప్పీలుకి వెళ్ళినా టిడిపి నుంచి సీట్ మాత్రం ఛాన్స్ వుండబోదన్న ప్రచారం సాగుతుంది. దాంతో తోట , ఆయన వర్గీయులు దశాబ్దాలుగా తమను ఇరకాటంలో పెడుతున్న కేసును అమితుమీ తేల్చుకోవడానికి అన్ని మార్గాల్లో వ్యూహాన్ని వేగవంతం చేశారు. కోర్టు తీర్పుపై, హై కోర్ట్ కి అప్పీల్ కి వెళ్ళినా అక్కడ కూడా తమకే అనుకూలంగా వచ్చేలా టిటి వర్గం పావులు కదుపుతుంది. మరి వారి ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయి ? లేక ఎమ్యెల్యే ప్రత్యర్థులదే పైచేయి అవుతుందా ? అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.
- Tags
- తోట త్రిమూర్తులు

