తెలుగు పండగకు అంతా సిద్ధం...!

తెలుగు పండగకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం సారథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష తియ్యదనాన్ని, గొప్పతనాన్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు. వందల సంఖ్యలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ సాహితీ సౌరభాలను ప్రపంచ నలుమూలలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజుల నుంచి ప్రతిరోజూ దీనిపై సమీక్ష చేస్తూనే ఉన్నారు.
మరి కాసేపట్లో ప్రారంభం...
ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ ఈ మహాసభలు జరగనున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి క్రీడా ప్రాంగణం ప్రధాన వేదికగా హైదరాబాదులో ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా లాల్ బహదూర్ శాస్త్రీ క్రీడా ప్రాంగణం, తెలుగు విశ్వ విద్యాలయము వేదిక, ఇందిరా ప్రియదర్శిని ప్రదర్శనాలయం, రవీంద్రభారతి ప్రదర్శనాలయం. తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికలపై ప్రభుత్వం సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ సభలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది సాహితీ వేత్తలు, కళాకారులు హాజరవుతున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు....
నేటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతున్నారు. చివరిరోజైన 19 వతేదీన జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వస్తున్నారు. దీంతో పోలీసులు భద్రత పరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. దాదాపు 9 వేల మంది పోలీసులను ఈ వేడుకల నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. వీరితో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కమాండో టీమ్స్, షీ టీమ్స్, క్రైం టీమ్స్ ప్రత్యేకంగా శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నాయి. ముఖ్యఅతిధులు నివసించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే వారి కోసం ఎక్కడికక్కడ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
- Tags
- తెలుగు మహాసభలు

