తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు?

తెలంగాణ కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కూడా ఈ పదవి కోసం పోటీ నెలకొని ఉంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం నవంబర్ నెల12వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏడుగురు అధికారులు ఈ పదవికి రేసులో ఉన్నారు. తెలంగాణ డీజీపీ పదవి చేపట్టేందుకు ప్రస్తుత పోలీస్ కమిషనర్ మహీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే రాజీవ్ త్రివేది కూడా అదే ప్రయత్నాలు ప్రారంభించారు. డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనురాగ్ శర్మ ఇన్ ఛార్జి డీజీపీగా పదవీ బాధ్యతలను చేపట్టారు. తర్వాత ఏడాది తర్వాత పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలను చేపట్టారు. వచ్చేది ఎన్నికల సమయం కావడంతో డీజీపీగా ఎవరిని ప్రభుత్వం సిఫార్సు చేస్తుందోనన్న ఉత్కంఠ పోలీసు ఉన్నతాధికారుల్లో నెలకొని ఉంది.
వీరిద్దరిలో ఒకరేనా?
తెలంగాణ డీజీపీ పదవి కోసం మొత్తం ఏడుగురు అర్హత కలిగిన ఐపీఎస్ లున్నారు. వీరిలో 1984 బ్యాచ్ కు చెందిన సుదీప్ లక్టాకియా, 1985 బ్యాచ్ కు చెందిన ఈష్ కుమార్, 1986 బ్యాచ్ కు చెందిన అలోక్ ప్రభాకర్ లు ఉన్నారు. అయితే వీరు ముగ్గురూ కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. వీరు తెలంగాణ డీజీపీగా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయితే 1983 బ్యాచ్ కు చెందిన తేజ్ దీప్ కౌర్ ఉన్నారు కాని ఆమెపై అవినీతి ఆరోపణలున్నాయి. ఇక 1986 బ్యాచ్ కు చెందిన రాజీవ్ త్రివేది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈ పదవి కోసం నార్త్ లాబీయింగ్ ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. మాజీ సీఎస్ రాజీవ్ శర్మ కూడా రాజీవ్ త్రివేది పట్ల సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత అదే బ్యాచ్ కు చెందిన మహేందర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ లు ఉన్నారు. కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారి కావడంతో ఆయనకు అవకాశాలు తక్కువే. ఇక మహేందర్ రెడ్డి తెలంగాణ వ్యక్తి. అయితే రాజీవ్ త్రివేది రెండేళ్లలో పదవీ విరమణ చేస్తుండగా, మహేందర్ రెడ్డికి నాలుగేళ్ల సమయం ఉంది. ఈ ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది. వారిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేసి రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ పంపిస్తోంది. ముగ్గురిలో ఒకరిని డీజీపీగా ప్రభుత్వం నియమిస్తుంది. మొత్తం మీద రాజీవ్ త్రివేది, మహేందర్ రెడ్డిల్లో ఒకరు డీజీపీ అయ్యే అవకాశముంది.
- Tags
- డీజీపీ

