తెలంగాణలో ప్రాజెక్టుల జోరు పెంచుతున్న హరీష్!

రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఒక ప్రాతిపదిక మీద జరిగిన ఎంపికలో మొదటి స్థానంలో నిలిచాయంటే, దేశంలోని అన్ని రాష్ట్రాలను తోసిరాజన్నాయంటే దాని అర్థం.. ఆ రెండు ప్రభుత్వాలూ ఒకరినుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ పరిపాలనలో మరింత వేగంగా ముందుకు దూసుకువెళుతున్నారనడానికి అది నిదర్శనం. ఒకరిని చూసి మరొకరు కాపీ కొడుతున్నారని అనుకున్నా, ఒకరు నడిచిన బాటలోనే మరొకరు నడిచి వెళుతున్నారని ఎద్దేవా చేసినా.. అంతిమఫలితం మాత్రం ఇద్దరూ అగ్రస్థానం సాధించడమే జరుగుతోంది.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. తెలంగాణ నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మంత్రి హరీష్ రావు ఇప్పుడు జోరు పెంచుతున్న తీరు.. అచ్చంగా చంద్రబాబు అనుసరిస్తున్న పద్ధతులను గుర్తుకు తెస్తోంది. ఏపీకి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఎంతటి కీలకమైనదో... తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా అంతే కీలకంగా భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండు కూడా తెలంగాణలో చాలా ముమ్మరంగా ఉంది. కేంద్రమంత్రి దత్తాత్రేయ లాంటి వాళ్లు తప్పకుండా జాతీయ హోదా సాధించుకు వస్తాం అనే అంటున్నారు.
ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డెడ్ లైన్ లు పెట్టుకుని 2017 సంవత్సరాంతానికి రైతులకు నీళ్లు అందించేలా పూర్తి చేయాలని, అలా చేయగలిగితేనే కేసీఆర్ స్వప్నాన్ని తాము నెరవేర్చినట్లు అవుతుందని మంత్రి హరీష్రావు అధికారులకు కర్తవ్యనిర్దేశం చేస్తున్నారు. అచ్చం పోలవరం విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న తరహాలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి వీడియోలు తీయించడం ద్వారా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడం, తరచూ సమీక్షలు జరపడం చేస్తున్నారు.
మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో కూడా జోరుగా పనులు పూర్తిచేయించడంలో కాంట్రాక్టర్లనుంచి పనులు వేగంగా చేయించడంలో తెలుగురాష్ట్రాలు ఒకరి మంచి పద్ధతులను ఒకరు అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాయి. పరస్పర సహకారం అప్రకటితంగానైనా ఇలాగే కొనసాగితే.. ప్రజలకు మేలు జరుగుతుంది.

