తెలంగాణలో నేరగాళ్లు ఇంతమందా?

తెలంగాణలో ఎంత మంది నేరస్తులు ఉన్నారో తెలుసా? పోనీ వారంతా ఏ క్యాటగిరీ నేరాలకు పాల్పడతారో తెలుసా? వాళ్లు ఇప్పుడు జైల్లో ఉన్నారా... ?లేక బయటే తిరుగుతున్నారా? బయట ఉంటే ఏం చేస్తున్నారు? ఎలాంటి నేరాలకు స్కెచ్ వేస్తున్నారు? నేరాలు చేసినవాళ్లు తప్పించుకుంటే ఎలా అన్న భయం ఉందా? ఎంత దూరం పారిపోయినా చివరకు చేరాల్సింది చెరసాలలోకే అంటున్నారు పోలీసులు. సకల జనుల సర్వే లాగా నేరస్తుల సమగ్ర సర్వేతో నేరగాళ్ల లెక్కలన్నీ తీస్తున్నారు తెలంగాణ పోలీసులు.
సమగ్ర సర్వేలో వెల్లడయిన వాస్తవం...
సకల జనుల సర్వే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వం చేరిన రికార్డ్ సర్వే. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది జనాభా ఉన్నారో తెలుసుకునేందుకు చేసిన ఈ సర్వేపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఇలాంటి సర్వేనే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తోంది. అదే నేరస్తుల సమగ్ర సర్వే. మొట్టమొదటి సారి తెలంగాణలో ఉన్న మొత్తం పోలీసు అధికారులు బస్తీలు... కాలనీలు... వీధుల్లోకి వచ్చేశారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరూ సర్వేలో పాల్గొన్నారు. ఇంతకీ ఈ సర్వే పూర్తయ్యే సరికి తెలంగాణలో నేరస్తులు ఎంత మంది ఉన్నారో తెలుసా? అక్షరాలా రెండు లక్షల 48 వేల మంది. అవును మీరు విన్నది నిజమే. రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది నేరగాళ్లున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు మరో 40వేల మందికి పైనే ఉన్నారని లెక్క తేలింది.
2 లక్షల 48 వేల మంది....
హైదరాబాద్‌లో 49 వేల మంది నేరస్తులుంటే... రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 20 వేల చొప్పున ఉన్నారు. చిన్నచిన్న చోరీలు చేసే దొంగల నుంచి కరుడుగట్టిన నేరగాళ్ల వరకు అందరి లెక్కలు తీశారు పోలీసులు. అయితే వీరిలో చాలామంది అజ్ఞాతంలో ఉన్నట్టు తెలిసింది. అజ్ఞాతంలో ఉన్న వారంతా ఏం చేస్తున్నారు? ఎలాంటి ఎత్తులు వేస్తున్నారో తెలుసుకునేందుకే ఈ సమగ్ర నేరస్తుల సర్వే నిర్వహించారు. డీజీపీ ఆర్డర్ వేయగానే... తెలంగాణలో పోలీసులంతా రికార్డులు పట్టుకొని పరుగులు తీశారు.
నేరగాళ్ల గుండెల్లో రైళ్లు....
పాతబస్తీలో 12 వందల మంది క్రిమినల్స్ జాబితాను సేకరించడమే కాకుండా... ప్రతి పోలీసు స్టేషన్లో ఉన్న వారి వివరాలు లేటెస్ట్ ఫొటో... ఫింగర్ ప్రింట్స్ సేకరించి... పోలీస్ కాప్‌లో యాప్‌లో అప్లోడ్ చేశారు. జియో ట్యాగింగ్ విధానం ద్వారా నేరస్తులపై నిఘా పెట్టారు. నేరస్తులు ఎక్కడికైనా పారిపోతే తమకు క్షణాల్లో మెసేజ్ వస్తుందని, వారు ఎక్కడున్నారో సులువుగా తెలిసిపోతుందంటున్నారు పోలీసులు. అంతే కాదు నేరం జరిగిన వెంటనే తమకు సమాచారం అందుతుందని, నేరాల సంఖ్య కూడా తగ్గుతుందన్నారు. గతంలో చైన్ స్నాచర్లపై సిటీ కమిషనరేట్‌లో చేసిన సర్వే వల్ల మంచి ఫలితాలొచ్చాయని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా నేరస్తుల సర్వే నిర్వహించామంటున్నారు పోలీసులు. మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఈ సర్వేతో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.

