తెదేపా ఎమ్మెల్యే ఇంటి పెళ్లిపై ఐటీ నజర్ !

గాలి జనార్దన రెడ్డి దేశం మొత్తం నివ్వెరపోయి ఇటువైపు చూసేంత అంగరంగ వైభవంగా కుమార్తె పెళ్లిని జరిపించి అతిథులను సంతోషపెట్టారు. ఈ పెళ్లికి వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్లుగా దేశమంతా కోడై కూసింది. పెళ్లి జరిగిన రెండో రోజున గాలిజనార్దనరెడ్డి వ్యాపారాలు, ఇళ్ల మీద ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సంపన్నులు పెళ్లిని ఎంత వైభవంగా నిర్వహిస్తున్నారనేది.. ఐటీ వారి దృష్టిని ఆకర్షించే ఒక సులువైన సంకేతంగా మారిపోయింది. అదే క్రమంలో ఇప్పుడు తెలుగుదేశానికి చెందిన ఏపీ లోని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస చౌదరి మీద కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస చౌదరి బుధవారం రాత్రి తన కొడుకు వివాహాన్ని కనీవినీ ఎరుగనంత వైభవంగా నిర్వహించారు. మంగళగిరి వద్ద ఉండే హాయ్‌ల్యాండ్ కు ఎదురుగా 20 ఎకరాల స్థలాన్ని కల్యాణ వేదికగా అత్యద్బుతంగా తీర్చిదిద్దారు. భారీ భారీ సెటింగులు వేశారు.
ఈ పెళ్లికి దాదాపు 75 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. కేవలం అతిథుల వసతి సదుపాయాలు, వారి ఆతిథ్యానికే 25 కోట్ల వరకు ఖర్చు చేశారని అనుకుంటున్నారు. పెళ్లికూతురు ధరించిన చీర ఒక్కటే 85 లక్షల ఖరీదు చేస్తుందని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా హాజరై.. ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయని అభినందించినట్లు చెబుతున్నారు.
ఈ వైభవం అంతా ఒక ఎత్తు.. ఇంత ఘనంగా పెళ్లి చేసిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస చౌదరి మీద ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు, పెళ్లికుమార్తె తండ్రి అయిన ఆయన వియ్యంకుడి మీద కూడా ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. అదే జరిగితే.. ‘‘పెళ్లి చేసి చూడు.. ఐటీకి చిక్కి చూడు’’ అని కొత్త సామెతను రాసుకోవాల్సి వస్తుందేమో.

