తిరుమల ఘాట్ రోడ్డు అంత సురక్షితం కాదా ..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని చేరుకునే ఘాట్ రోడ్డులు సురక్షితంగా లేవని తేలిపోయింది. ఈ ఘాట్ రోడ్లపై వెళ్ళేటప్పుడు కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని దీనికి నివారణోపాయాలు సూచించిన ఐఐటి నిపుణుల కమిటీ రెండేళ్ళ క్రితమే చెప్పినా పట్టించుకున్న వారే లేరు. తాజాగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రెండు చోట్ల కొండచరియలు విరిగి పడి టిటిడి ని మరోసారి హెచ్చరించాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో భక్తులు ఆ వైపు ప్రయాణించకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అదే వాహనాలు ఆ సమయంలో అటుగా వెళ్ళి వుండి ఉంటే ఊహించలేని నష్టం వాటిల్లేది.
కమిటీ ఏమి చెప్పింది ..? టిటిడి ఏం చేసింది ...?
గత నాలుగేళ్లుగా తిరుమల గిరుల్లోని ఘాట్ రోడ్డుల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టిటిడి బోర్డు ఐఐటి నిపుణులకమిటీని ప్రమాదాల నివారణకు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2015 లో కోరింది. దాని ప్రకారం రెండు ప్రధాన ఘాట్ రోడ్డులను అధ్యయనం చేసిన కమిటీ నాలుగు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని అక్కడి కొండరాళ్ళను బ్లాస్టింగ్ ద్వారా తొలగించి ముప్పులేకుండా చేయాలని సూచించింది. మొదటి ఘాట్ రోడ్ లో 8 వ కిలోమీటర్ వద్ద నిపుణుల కమిటీ సూచించిన విధంగానే కొండచరియలు విరిగిపడ్డాయి . అలాగే అక్కగార్ల ఆలయం వద్ద కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రమాదం చోటు చేసుకుంది. కానీ టిటిడి కమిటీ ఇచ్చిన నివేదిక చెత్త బుట్టలో వేసి భక్తుల రక్షణ దేవుడిపై వేయడంతో నేరపూరిత నిర్లక్యం ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది.
మరోసారి అధ్యయనం అంటున్నారు ...
ప్రమాదాల నివారణ కోసం పాత పాలకవర్గం కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదిక పై చర్యలు గాలికి వదిలి పెట్టింది. ఇప్పుడు తాజాగా కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో టిటిడి ఈవో అనిల్ సింఘాల్ మారోసారి నిపుణుల కమిటీ ని నియమించి చర్యలు తీసుకుంటామని చెప్పడం చిత్రంగా వుంది. నాలుగేళ్లుగా తిరుమల శ్రీవారి రెండు ఘాట్ రోడ్డులు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసినా భక్తుల రక్షణ కు చర్యలు తక్షణం తీసుకోవాలిసిన అధికారులు కమిటీలపై కమిటీలు వేసి కాలక్షేపం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది . శ్రీవారి దర్శనానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తారని తెలిసినా టిటిడి ఇలా వ్యవహరించడం దారుణం.

