ట్రాయ్ లూప్‌హోల్స్ ను ఎంచక్కా వాడుకున్న జియో

రిలయన్స్ ముఖేష్ అంటూ ఇప్పటిదాకా వ్యవహరిస్తున్న భారతదేశపు వ్యాపార దిగ్గజాన్ని ఇకమీదట ‘జియో ముఖేష్’ అని వ్యవహరించినా కూడా ప్రజలు సులభంగా పోల్చుకోగలరు. మార్కెట్లోకి వచ్చి మూడు నెలలు కాకముందే.. అంతగా ప్రజల్లోకి వెళ్లిపోయిన టెలికాం ఆపరేటర్ గా జియో ప్రకంపనాలు సృష్టిస్తోంది. మార్చి 31 వరకు కూడా జియో డేటా సేవలు మొత్తం ఉచితంగా ఇస్తున్నట్లుగా ప్రకటించడానికి రిలయన్స అధినేత ముఖేష్ గురువారం మీడియా ముందుకు రాగానే.. టెలికాం ఆపరేటర్లలో పోటీ సంస్థలు అయిన ఎయిర్టెల్, ఐడియా ల షేర్లు మార్కెట్ లో 3000 కోట్ల రూపాయల మేర పడిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే జియో దెబ్బకు పోటీ ఆపరేటర్లు కుదేలైపోవడం అనేది కేవలం షేర్ల పతనంతో ఆగేలా కనిపించడం లేదు. జియో మొబైల్ వాడకానికి క్రమంగా అలవాటు పడుతున్న వినియోగదారులు ఇప్పటికే వాడుతున్న ఇతర సంస్థల మొబైల్ ల వాడకాన్ని తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు ఆ కంపెనీల రీచార్జిలు అనుబంధ వ్యాపారం మొత్తం ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. అదొక్కటే కాదు.. నెంబర్ పోర్టబిలిటీ కి కూడా ఆస్కారం కల్పిస్తున్నట్లు జియో తాజాగా ప్రకటించడంతో.. ఈ ఆఫర్ల మోజులో ఎందరు మారిపోతారో అనేది కూడా కీలకం.
అయితే.. జియో ఈ రకమైన ఆకర్షణీయ ఆఫర్లతో మార్కెట్ ను అతలాకుతలం చేసేస్తున్నదంటూ.. పోటీ సంస్థలు ఇప్పటికే ట్రాయ్ కు ఫిర్యాదులు చేశాయి. తొలివిడత జియో ఆఫర్ మీదనే ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ మీద మళ్లీ ట్రాయ్ ను ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం.. కస్టమర్లను ఆకర్షించడానికి ఎవరైనా సరే.. ఎలాంటి ఆఫర్ ను అయినా సరే.. 90 రోజులపాటు మాత్రమే వర్తింపజేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలో ఉన్న లూప్ హోల్ ను జియో చాలా తెలివిగా వాడుకుంటున్నదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబరు 31 వరకు ఇచ్చిన ఆఫర్ కు ఒక పేరు పెట్టి, మార్చి 31 వరకు ఉండబోయే ఆఫర్ కు హేపీ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ కొత్త పేరు పెట్టి, ఈ రెండూ వేరు వేరు ఆఫర్లని.. కాబట్టి 90 రోజుల వంతున కస్టమర్లకు అందింవచ్చునని వారు ఎడ్వాంటేజీ తీసుకునేలా ప్లాన్ చేశారు. మొత్తానికి మార్చి 31 నాటికి భారతీయ టెలికాం మార్కెట్ ను కొత్త పుంతలు తొక్కించాలనే జియో ప్రయత్నం ఎలా నడుస్తుందో చూడాలి.

