ట్యాంక్ బండ్ పై మరో మిలియన్ మార్చ్

మరోసారి మిలియన్ మార్చ్ తెలంగాణలో జరగనుందా? అవును ఈ నెల 10వ తేదీన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ప్రజలు భారీగా తరలి రావాలని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పిలుపు నిచ్చారు. ఈనెల 10వ తేదీన ట్యాంక్ బండ్ పై నిర్వహించే సభకు భారీగా ప్రజలు తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వం మర్చిపోయిందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఏ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఏర్పడిందో...అవి అందకుంటే ప్రయోజనమేంటని ప్రశ్నించారు.
ఈ నెల 10వ తేదీన.....
ఈనెల 10వ తేదీన ట్యాంక్ బండ్ పై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4గంటల వరకూ సభ జరుగనుంది. ఈ సభకోసం ఏర్పాట్లపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ సమీక్షించారు. ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే ట్యాంక్ బండ్ పై ఈ సభను నిర్వహిస్తున్నామని కోదండరామ్ చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన మిలియన్ మార్చ్ చారిత్రాత్మక ఘట్టమని, దాన్ని గుర్తు చేసేందుకే ట్యాంక్ బండ్ పై సభను నిర్వహిస్తున్నట్లు జేఏసీ తెలిపింది.
పోలీసులు అనుమతిస్తారా?
అయితే ట్యాంక్ బండ్ పై ఈ నెల 10వ తేదీన జరగనున్న సభకు పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇటీవలే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై రిజ్వర్వేషన్ల కోసం చేసిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. పైగా కోదండరామ్ సభకు ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుమతివ్వడం లేదు. దీంతో ఈ సభ నిర్వహణకు పోలీసులు అనుమతిస్తారా? అన్నది అనుమానమే. ఈ సభకు తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే అన్ని పార్టీలను, ప్రజాసంఘాలను పిలుస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- మిలియన్ మార్చ్

