టీడీపీ ఎమ్మెల్యే అస్సలు కన్పించరు

మా ఎమ్మెల్యే అసలు కన్పించరు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యే అంటే ఎవరో మాకు తెలియదు. ఆయనను ఇప్పటి వరకూ చూడలేదు. ఎమ్మెల్యేనా? ఆయనెవరు? ఈ ప్రశ్నలన్నీ వేస్తుంది ఆ నియోజకవర్గ ప్రజలే. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు చేరువుగా ఉండాల్సిన వ్యక్తి ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అసలు నియోజకవర్గానికి రావడమే కద్దు. ఎప్పుడైనా వచ్చినా కొన్ని గంటల్లోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తుర్రుమంటారు. ఆయన ఎవరో కాదు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రస్తుత వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాదాల జానకిరామ్, విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరందరినీ గుర్తు చేసుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు విలపిస్తున్నారు. వారందరూ కొద్దోగొప్పో తమ సమస్యలను వినేవారని, కాని ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని చెబుతున్నారు. కేవలం ప్రజలే కాదు టీడీపీ కార్యకర్తలదీ అదే పరిస్థితి. పార్టీ కార్యక్రమాలకు కూడా రావడం అరుదుగానే జరుగుతుంటుంది.
ప్రజల కంటే వ్యాపారాలే......
ఎమ్మెల్యే బొల్లినేని రామరావు ఏ 1 కాంట్రాక్టర్. ఆయన మహారాష్ట్రలోనే ఎక్కువగా కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. ఆయన ఉంటే మహారాష్ట్ర లేకుంటే హైదరాబాద్... మరీ కాకుంటే నెల్లూరు.... అప్పుడప్పుడూ అమరావతి. ఇంతే తప్ప ఆయన ఉదయగిరి నియోజకవర్గ సమస్యలను అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఎప్పుడన్నా వచ్చినా కలిగిరిలో క్యాంప్ పెట్టేస్తారు. నియోజకవర్గాల నేతలందరినీ అక్కడికే పిలిపించుకుని మాట్లాడుకుంటాడు. ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్నా ఈ ఎమ్మెల్యే రెండు రోజులపాటు ఒక గంట పాల్గొని వెళ్లిపోవడం విశేషం. ఆయన హైక్లాస్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పేరుపొందాడు. ఈ విషయం తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు అనేకసార్లు మందలించారు కూడా. కాని ఆయనకు ప్రజలకంటే వ్యాపారమే ముఖ్యంలా ఉంది. అందుకే ఆయన పొరుగు రాష్ట్రాల్లోనే సంచరిస్తుంటారు. మొత్తం మీద ఎమ్మెల్యే బొల్లినేని వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. మహారాష్ట్ర కాంట్రాక్టుల్లో జరిగిన అవకతవకలపై మహారాష్ట్ర ఏసీబీ కేసు నమోదు చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే దానిని బొల్లినేని ఖండించారనుకోండి. సో.... బొల్లినేని మీకు కన్పిస్తే కాస్త ఇక్కడకు రమ్మని చెప్పరూ... అంటూ ఉదయగిరి ప్రజలు వేడుకుంటున్నారు.

